నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
● మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రతీ పోలీసు అధికారి పనిచేయాలని మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ, సమర్థవంతమైన పోలీసు వ్యవస్థతో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉంటాయన్నారు. నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ పోలీసుశాఖకు ప్రతిష్ట తీసుకువచ్చేలా పనిచేయాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పోలీసు అధికారుల పనితీరు భేష్‌గా ఉందన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ప్రత్యక్షంగా సందర్శించి వారి పని తీరును సమీక్షించాలన్నారు. రోజువారీ పెట్రోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకునేలా పనిచేయాలన్నారు. మహిళల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీటీం బృందాలను మరింత బలోపేతం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. అంతకముందు ఐజీకి ఎస్పీ పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ బలగాల చేత గౌరవ వందనం స్వీకరించారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, రంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్‌అలీఖాన్, రఫీక్‌ఖాన్, శ్రీనివాస్, వేణుగోపాల్, రాంనర్సింహారెడ్డి, రవి, నిరంజన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సురేశ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment