సన్నగిల్లిన ఆశలు
● డిసెంబర్‌లో తెగిపోయిన సూరమ్మ చెరువు కట్ట ● యాసంగి పంటల సాగు కష్టమంటున్న రైతులు ● రూ.40 లక్షల విలువైన చేపలు బయటకు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు
కథలాపూర్(వేములవాడ): ప్రకృతి వైపరీత్యమో.. కావాలనే ఎవరైనా చేశారో తెలియదు కానీ చెరువు కట్ట కోతకు గురికావడంతో దానిని నమ్ముకొని జీవి స్తున్న మత్స్యకారులు, రైతుల ఉపాధికి గండి కొట్టినట్లయింది. కలిగోట గ్రామశివారులోని సూరమ్మ చెరువుకట్ట డిసెంబర్‌లో కోతకు గురికావడంతో అందులోని నీళ్లు, చేపలు వెళ్లిపోయి వెలవెలబోయింది.
650 ఎకరాల్లో చెరువు
● కథలాపూర్ మండలం కలిగోట గ్రామశివారులో గల సూరమ్మ చెరువు సుమారు 650 ఎకరాల్లో విస్తరించి ఉంది.
● ఇందులో నీళ్లుంటే మండలంలోని కలిగోట, అంబారిపేట, తాండ్య్రాల, బొమ్మెన, పోసానిపేట గ్రామాలతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామంలో భూగర్భజలాలు పెరుగుతాయి. సదరు గ్రామాల పరిధిలో రెండు సీజన్‌లలో పంటలు సమృద్ధిగా పండుతాయి.
● అంతేకాకుండా ఏటా మత్స్యకారులు చెరువులో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. సుమారు నాలుగు నెలలుగా మత్స్యకారులు పెంచుకున్న చేపలు సైతం బయటకు వెళ్లిపోయాయి.
● అలాగే చెరువుపై ఆధారపడి పంటలు సాగు చేసుకునే రైతులు ఇప్పుడు పంటలు ఎలా పండుతాయని దిగులు చెందుతున్నారు. చేపలు వృథాగా బయటకు వెళ్లడంతో లక్షలాది రూపాయలు నష్టం జరిగిందని మత్స్యకారులు పేర్కొంటున్నారు.
● నీటిపారుదలశాఖ అధికారులు, ప్రభుత్వం చొరవ చూపి చెరువుపై ఆధారపడి జీవిస్తున్నవారికి నష్టపరిహారం అందించాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment