సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్ అటాచ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సీఐడీ డీఎస్పీ సీహెచ్. శ్రీనివాస్ అటాచ్ అయ్యారు. డీజీపీ కార్యాలయంలోని సీఐడీ కేంద్ర కార్యాలయంలో వెంటనే రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. గతనెల 29వ తేదీతో వెలువడిన ఈ ఆదేశాలు శనివారం వెలుగుచూశాయి. ఇటీవల వెలుగుచూసిన గోల్డెన్ బెల్లీ రియాలిటీ (జీబీఆర్) కేసు దర్యాప్తు నిస్పక్షపాతంగా జరగడం లేదంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో సీఐడీ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై సీఐడీ ఉన్నతాధికారులను సంప్రదించగా.. అంతర్గత విషయమని సమాధానమిచ్చారు. జీబీఆర్ క్రిప్టో కరెన్సీ అంటూ జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలానికి చెందిన నెల్లుట్ల గ్రామానికి చెందిన రమేశ్‌గౌడ్ కరీంనగర్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రూ.కోట్లు వసూలు చేసిన కేసును ప్రస్తుతం సీఐడీ (ఎకనమిక్ అఫెన్స్ వింగ్) దర్యాప్తు చేస్తోంది.
వ్యక్తి ఆత్మహత్య
జగిత్యాల క్రైం: జగిత్యాల పట్టణంలోని టాకాసందికి చెందిన గుండేటి దేవేందర్(51) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గీత వివరాల ప్రకారం.. దేవేందర్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బ ందులతో బాధ పడుతున్నాడు. అప్పులిచ్చినవారు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఉదయం బాత్‌రూంలో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
మిస్సింగ్ కేసు
రామగిరి(మంథని):
సెంటనరీకాలనీకి చెందిన తాజుద్దీన్(31) కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజుద్దీన్ గతనెల 31న మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంట్లో నుంచి బయటి వెళ్లిపోయాడని, తిరిగి ఇంటికి రాలేదని అతడి భార్య అతీయా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువ రైతు మృతి
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండకు చెందిన రేండ్ల బాబన్న అలియాస్ రేండ్ల రెడ్డి(38) అనే యువకుడు శనివారం పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు భార్య సాత్విక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. బాబన్న శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. అయితే పొలంలోని బురదలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య సాత్విక, కుమారుడు అభిరామ్(8) ఉన్నారు. తన భర్త బాబన్న మృతిపై అనుమానం ఉందని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment