దివ్యాంగ క్రీడాకారులకు అభినందన
బచ్చన్నపేట : సీఎం కప్–2024 క్రీడల్లో భాగంగా పలు విభాగాల్లో గెలుపొందిన దివ్యాంగ క్రీడాకారులను స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం అభినందించారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం పారా స్పోర్ట్స్ నిర్వహించగా, బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ గ్రామానికి చెందిన పి.అమరేశ్వర్, తమ్మడపల్లి గ్రామానికి చెందిన మట్టి కిషన్ దివ్యాంగుల వీల్‌చైర్ క్రికెట్, వాలీబాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరిని ఎమ్మెల్యే కడియం అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసిన సీపీఐ నాయకులు
స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి : ఎమ్మెల్యే కడియం శ్రీహరిని సీపీఐ జిల్లా నాయకులు ఆదివారం హనుమకొండలో మర్యాద పూర్వకంగా కలిశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి ఆధ్వర్యంలో కడియంకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్టేషన్‌ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందించగా సానుకూలంగా స్పందించారని సీపీఐ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆది సాయన్న, పాతూరి సుగుణమ్మ, కావటి యాదగిరి, నాయకులు భువనగిరి కుమార్, యూనుస్, యాదగిరి, రాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment