అన్నదాతకు భరోసా..
జనగామ : అన్నదాతలకు ఏడాదికి రెండు సీజన్లలో ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.12వేల పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ‘రైతు భరోసా’ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం యాసంగి పెట్టుబడి కోసం జిల్లాలో ఇప్పటి వరకు ఎకరం నుంచి రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న 12,292 మంది రైతుల ఖాతాల్లో రూ.15.87 కోట్లు జమ చేయాల్సి ఉండగా రెండు రోజుల క్రితం ప్రక్రియ ప్రారంభమైంది.
అర్హులు 1.96లక్షల మంది రైతులు..
జిల్లాలో 3.50లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా.. వానాకాలం 3.20 లక్షల ఎకరాలు, యాసంగి లో 2లక్షల ఎకరాల వరకు సాగవుతున్నది. 2023– 24 యాసంగి సీజన్‌లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1,89,236 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.206.82కోట్లు అందించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. గత ప్రభుత్వం గుట్టలు, చెట్లు, కమర్షిల్ భూములకు సైతం పెట్టుబడి సాయం అందించిందనే ఆరోపణల నేపథ్యంలో భూసర్వే చేపట్టింది. అనర్హత జాబితాలో ఉన్న భూవివరాలను తొలగించడంతో ఆలస్యం జరిగింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ పెట్టుబడి సాయం విషయమై రైతుల పక్షాన నిలబడి ఆందోళనలకు దిగడం.. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో పెట్టుబడి సాయం విడుదల చేసింది.
7,010 ఎకరాలు తొలగింపు
‘రైతు భరోసా’ పథకం అమలుకు ముందు జిల్లాలో సాగుకు యోగ్యమైన భూమిని సర్వే చేసింది. ఇందులో 7,010 ఎకరాల భూమి అనర్హత కింద గుర్తించి జాబితా నుంచి తొలగించారు. అందులో కోళ్లఫాంలు, పెట్రోలు బంకులు, గుట్టలు, ఫంక్షన్ హాళ్లు, ఇతర కమర్షియల్ నిర్మాణాలు ఉన్నట్లు సర్వేలో గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. తుది నివేదిక ద్వారా రైతు భరోసా పథకానికి జిల్లాలో 1,96,360 మంది రైతులు అర్హులు గా ఉన్నట్లు ప్రకటించారు. ఎకరం నుంచి రెండెకరా ల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.
రైతన్నల అకౌంట్లలో ‘రైతు భరోసా’ పైకం
యాసంగి పెట్టుబడి సాయం రూ.15.87కోట్లు
పథకానికి అర్హులైన రైతులు
1.96 లక్షల మంది
అనర్హత కింద జిల్లాలో
7వేల ఎకరాల భూమి తొలగింపు
రూ.12వేలు జమయ్యాయి..
నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. వానాకాలంలో పెట్టుబడి సాయం వస్తుందని ఎదురు చూసిన. యాసంగికి అందింది. ప్రభుత్వం రూ.12వేలు అకౌంట్‌లో జమ చేసింది. చాలా సంతోషంగా ఉంది. కలుపు తీత, ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగపడతాయి.
– గంధం చంద్రమౌళి, రైతు,
వడ్డెగూడెం(జఫర్‌గఢ్)
రూ.1,500 వచ్చాయి
నాకు పది గుంటల భూమి ఉంది. కాంగ్రెప్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉన్న భూమి మేరకు రూ.1,500 ‘రైతు భరోసా’ సాయం జమ చేసింది. పొలంలో కలుపు తీయిస్తాన.
– తేలుకంటి అంజయ్య, రైతు, బచ్చన్నపేట
Comments
Please login to add a commentAdd a comment