నష్టాన్ని మిగిల్చిన పత్తిసాగు
రేగొండ : ఈ ఏడాది పత్తి సాగు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎంతో కష్టపడి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను సాగుచేస్తే చేసిన కష్టం, దిగుబడి ఏమో కానీ కనీసం పెట్టుబడి రాకపోగా అప్పుల పాలు చేసింది. వచ్చిన కొద్ది పంటకై నా మార్కెట్‌లో సరైన ధర వస్తుందనుకుంటే నాణ్యత లేదనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేశారు. దీంతో ఎటూ పాలు పోని స్థితిలో రైతులు కొట్టు మిట్టాడుతున్నారు. మండలంలోని 37 జీపీల పరిధిలో 14,256 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున 1,46,256 క్వింటాళ్ల పత్తి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. సాగుకోసం రైతులు వివిధ కంపెనీల పత్తి విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు. సాగైన పత్తి పంటకు దుక్కులు దున్నిన నాటి నుంచి ఎరువులు, పురుగు మందులు, కూలీలకు కలిపి ఎకరాకు సుమారు రూ. 30 వేల పెట్టుబడి అయింది. మొదట్లో సాగు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత పూత, కాత దశలో అకాల వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితులతో తెగుళ్లు ఆశించి పత్తి కాయలు రాలిపోయాయి. దీంతో ఒక్కో చెట్టుకు 15–25 కాయలు మాత్రమే మిగిలాయి. ఉన్న పంటను కూలీల ద్వారా తీయిస్తే ఒక్కో ఎకరాకు మూడున్నర నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. కనీసం పెట్టుబడి అయినా వస్తుందేమో అనుకుంటే మార్కెట్‌లో నాణ్యత లేదనే సాకుతో క్వింటా పత్తికి రూ. 6,500 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వచ్చిన పైసలు కూలీలకే సరిపోతున్నాయన్నారు. ఈ ఏడాది పత్తిసాగుతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి రాలేదు.. ధర లేదు
ఎకరాకు నాలుగైదు క్వింటాళ్లే
లబోదిబోమంటున్న రైతులు
ఐదు ఎకరాల్లో సాగు చేశా..
ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. మొదట్లో వర్షాలు సరిగా పడకపోవడంతో మొక్కల్లో ఎదుగుదల తగ్గిపోయింది. మొదట్లో వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండు, మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఎడతెరిపి లేని వర్షాలతో మొక్కలు ఎర్రబడి ఎదుగుదల ఆగిపోయింది.
– వన్నాల శివాజీ, కొత్తపల్లిగోరి
రూ.70 వేల పెట్టుబడి పెట్టాను
మూడున్నర ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఇప్పటి వరకు రూ.70 వేల పైనే పెట్టుబడి అయింది. వర్షాల కారణంగా పత్తి చేలలో నీరు నిలిచి మొక్కలు ఎర్ర బారాయి. ఇప్పటి వరకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా పత్తికి ప్రభుత్వం రూ. 10 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలి.
– జంగేటి సంజీవ్, జూబ్లీనగర్
పెరిగిన పెట్టుబడి..
వర్షాలకు పత్తి చేలల్లో కలుపుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏకదాటి వర్షాలతో కలుపు తీవ్రంగా పెరగడంతో పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కలుపు మొక్కలను తొలగించేందుకు కూలీలకు ఒక ఎకరాకు రూ. 4 నుంచి రూ. 5 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండటంతో ఎకరాకు రూ.1000 నుంచి రూ. 2 వేల వరకు ఖర్చు చేసి పలువురు రైతులు కలుపు మందును పిచికారీ చేశారు. అయినా పూర్తిస్థాయిలో నివారణ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment