బాల్యానికి ‘బంధం’
బాల్యం వివాహ బంధంలో బందీ అవుతోంది.. మూడుముళ్లతో ముక్కుపచ్చలారని బాలికల జీవితాన్ని ముడిపెడుతున్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి చట్టాలు ఉన్నా.. అవగాహనా రాహిత్యంతో కొందరు.. ఆర్థిక సమస్యలతో మరికొందరు బాల్య వివాహాలు చేస్తూ వారి బంగారు భవిష్యత్‌ను బుగ్గి చేస్తున్నారు.
సాక్షి, వరంగల్ : ఆధునిక సాంకేతికత ఎంతో పెరిగింది. సమాజంలో పెనుమార్పులు వచ్చాయి. అయినా బాల్యవివాహాలు ఆగడం లేదు. ఆడపిల్లలు చదువులో రాణిస్తూ అన్నిరంగాల్లో దూసుకుపోయి సత్తా చాటుతున్నా ఇంకా పలుచోట్ల బలవంతపు వివాహాలు చేస్తూ బలి చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఇప్పటికీ తరచూ బాల్యవివాహలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో 2023 సంవత్సరం 106 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకోగా.. ఈ ఏడాది ఏకంగా 140 వరకు నిరోధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా వెలుగులోకి రానివి అనేకం ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. 18 ఏళ్లలోపు బాలికలు 26.8 శాతం మంది, 21 ఏళ్లలోపు బాలురు 20.3 శాతం మంది బాల్యవివాహాల బారిన పడుతున్నట్లు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.
ఆ కుటుంబాల్లోనే ఎక్కువ..
తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయినప్పుడు బాలికలను భారంగా భావిస్తున్నారు. 14 నుంచి 18 ఏళ్లలోపు వారిని పెళ్లి పీటలెక్కిస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అమ్మాయిలు బడికెళ్లి చదువుకుంటుండగానే మధ్యలో ఆపి మెడలో పసుపుతాడు వేసేందుకు పట్టుబడుతున్నారు. తండ్రి చనిపోయాడని, పేదరికం పట్టి పీడిస్తోందని, అందుకే అమ్మాయిల భారం దించేసుకోవాలని బాల్యవివాహాలు చేస్తున్నారు. ఇది నిరక్షరాస్యులైన కుటుంబాల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని వచ్చిన కేసులను అధికారులు పరిశీలిస్తే తెలుస్తోంది. తమ కులంలో ఆడబిడ్డలకు త్వరగా పెళ్లి చేయడమే సంప్రదాయమని చెబుతూ మైనర్లుగా ఉన్నప్పుడు మనువు కానిచ్చేస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి.
అధికారులు ఆపిన బాల్య వివాహాల కేసుల వివరాలు..
ఆరోగ్యపరంగా చాలా నష్టం..
పెళ్లి వయస్సు రాకుండా వివాహం చేయడం వల్ల అమ్మాయిలైనా, అబ్బాయిలైనా చాలా కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక, శారీరక పరిపక్వత లేకపోవడం మూలంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. స్వతహాగా ఎదుర్కోలేక మానసికంగా కుంగిపోతారు. చిన్న వయస్సులో గర్భం దాలిస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
–డాక్టర్ నరేశ్ కుమార్,
రాష్ట్ర వైద్యమండలి సభ్యుడు
వివాహ నమోదు తప్పనిసరి చేయాలి
జనన, మరణ తేదీల నమోదు మాదిరిగానే వధూవరుల వయ సు, పాఠశాల, ఆస్పత్రి రికార్డులను పరిశీలించి మేజరైతేనే ముహూర్తం పెట్టేలా బ్రాహ్మణులు చర్యలు తీసుకోవాలి. పెళ్లి నమోదు రికార్డులను సంబంధిత అధికారులకు అప్పగించేలా చూస్తే చాలావరకు బాల్యవివాహాలను కట్టడి చేయవచ్చు.
–మండల పరశురాం,
సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, ఉమ్మడి వరంగల్
1098 టోల్ ఫ్రీ నంబర్‌కు
సమాచారం ఇవ్వండి..
వివాహ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్దేశించింది. చాలావరకు బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. వీటిని నిరోధించడానికి 1098 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది.
–బి.రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి
ఈనెల 5న వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలికకు వరుసకు మేనబావ అయిన 28 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులు బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. తర్వాత ఆమె తల్లిదండ్రులకు బాల్యవివాహంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని లిఖితపూర్వకంగా హామీ తీసుకుని బాలికను అప్పగించారు.
ఈనెల 14న ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఓ 16 ఏళ్ల బాలికకు 27 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నారని 1098 నంబర్‌కు రెండురోజుల ముందే సమాచారం వచ్చింది. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు వెళ్లి అమ్మాయి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో బాలికను వారితో పంపించారు.
నవంబర్ 19న వరంగల్ జిల్లా దుగ్గొండి మండల పరిధిలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అబ్బాయికి వివాహం అవుతున్నట్లు ఫోన్ రావడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారులు వెళ్లి పెళ్లి ఆపారు. తర్వాత అమ్మాయిని సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచి నర్సంపేటలోని ఆశ్రమ పాఠశాలకు తరలించారు. అక్కడ రెండు రోజులున్న తర్వాత అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
పెరుగుతున్న బాల్య వివాహాలు
2023లో 106..
ఈ ఏడాది ఏకంగా 140
అధికారులు ఆపినవి ఇవే అయితే
అనదికారికంగా ఎన్నో..
ఏటికేడు పెరుగుతుండడంతో
అధికారుల్లో ఆందోళన
తల్లిదండ్రుల్లో మార్పుతోనే
అరికట్టే అవకాశం
జిల్లా 2023 2024
వరంగల్ 18 7
హనుమకొండ 10 43
భూపాలపల్లి 9 18
జనగామ 14 13
ములుగు 15 9
మహబూబాబాద్ 36 50
Comments
Please login to add a commentAdd a comment