?
పట్టింపేది..
పారిశుద్ధ్య సిబ్బందికి కనీస రక్షణ సామగ్రి కరువు
● సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు ● 964మంది మల్లీపర్పస్ వర్కర్స్
కాటారం: గ్రామాల్లో అపరిశుభ్రతను తొలగించి నిత్యం పరిశుభ్రతను నెలకొల్పడానికి కృషిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చెత్తాచెదారం, మురుగు కాల్వల్లో పూడిక నెలకొనకుండా శ్రమిస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు కనీస రక్షణ పరికరాలు అందడం లేదు. అన్ని సమయాల్లో ప్రాణాలకు తెగించి పనులు చేయడంలో ముందు వరుసలో ఉన్నా.. ప్రభుత్వాలు వారిని ఏ మాత్రం గుర్తించడం లేదు. ఏ ఒక్క గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు ఇంత వరకు రక్షణ సామగ్రి అందిన దాఖలాలు లేవు. కొంతకాలం క్రితం కొన్ని గ్రామపంచాయతీల్లో ఏదో రేడియం జాకెట్లు అందజేసి చేతులు దులుపుకున్నారు తప్ప మిగితా రక్షణ పరికరాల జాడే లేకుండా పోయింది.
పూర్తిగా అందని సామగ్రి..
వీధులను శుభ్రంగా ఉంచేందుకు ఉదయమే రోడ్లపైకి చేరుకొని విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి కొన్ని నెలలుగా రక్షణ సామగ్రి ఇవ్వలేదు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం, చెత్తాచెదారం ఎత్తడం వంటి పనులు చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి సబ్బులు, నూనె, మాస్కులు, శానిటైజర్లు, హెల్మెట్లు, బూట్లు, రేడియంతో కూడిన జాకెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు అవేమీ పట్టించుకోకుండా సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా పారిశుద్ధ్య సిబ్బంది, వారి కుటుంబాలు నిత్యం అనారోగ్యం పాలవుతున్నారు.
పెరిగిన పని భారం..
ఆరోగ్య సంరక్షణకు పరిశుభ్రతే ప్రధాన ఆయుధమని గుర్తించిన ప్రభుత్వం గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్లను నియమించింది. పంచాయతీలో ఇంటింటి నుంచి చెత్త సేకరించి వీధుల్లో అపరిశుభ్రత నెలకొనకుండా చూసుకోవడమే వీరి ప్రధాన కర్తవ్యం. నిత్యం మురుగు కాల్వలు శుభ్రం చేయడం, వీధులు ఊడవటం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం వంటి పనులను విరామం లేకుండా చేశారు. చెత్తాచెదారం ట్రాక్టర్‌లోకి ఎత్తడం, డంపింగ్ యార్డులకు తరలించడం వంటి పనులు చేస్తున్నారు. కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగించడంతో పాటు దోమల నియంత్రణకు మందులు పిచికారీ చేస్తున్నారు.
నిధుల లేమితో..
రక్షణ సామగ్రిని గ్రామపంచాయతీ నిధుల ద్వారా కొనుగోలు చేసి అందించాల్సి ఉంటుంది. ప్రత్యేక నిధుల మంజూరు లేకపోవడంతో గ్రామపంచాయతీలపై ఆర్థిక భారం పడుతుంది. జీపీల్లో నిధుల కొరత వెంటాడుతుండటంతో అధికారులు రక్షణ సామగ్రిలోని ఒకటి రెండు వస్తువులు కొనుగోలు చేసి కార్మికులకు ఇస్తూ కాలం వెల్లదీస్తూ వస్తున్నారు.
కనీస రక్షణ లేకుండానే పనులు..
పారిశుద్ధ్య నిర్వహణకు మల్టీపర్పస్ కార్మికుడికి రక్షణ సామగ్రి చాలా ముఖ్యం. దుస్తులు, పారలు అందజేయాల్సి ఉంటుంది. కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజులు ఇవ్వాలి. సామగ్రి ఇవ్వకుండానే పనులు చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రక్షణ సామగ్రి లేకుండానే పనులకు దిగుతుండటంతో ఒక్కోసారి మురుగు కాల్వల్లో గాజుముక్కలు గుచ్చుకుంటున్నాయి. రేడియం జాకెట్లు లేకపోతే రోడ్లు ఊడ్చే వారు ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది.
జిల్లా వివరాలు..
రక్షణ సామగ్రి ఇవ్వాలని ఆదేశించాం
జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ సామగ్రి అందజేయాలని ఆదేశించాం. పారిశుద్ధ్య కార్మికులు సంకోచం లేకుండా నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతుంటారు. వారికి ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా చూసుకోవడం బాధ్యతగా భావిస్తున్నాం. ఎక్కడైనా రక్షణ సామగ్రి అందకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రతీ కార్మికుడు రక్షణ ప్రమాణాలు పాటిస్తూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అవగాహన కల్పిస్తున్నాం.
– వీరభద్రయ్య, డీఎల్‌పీఓ
Comments
Please login to add a commentAdd a comment