3 కొత్త జీపీలు
కాటారం: కాటారం మండలంలో మరో మూడు నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు జరగనుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటీవల అధికారులు దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మండలంలో ప్రస్తుతం రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దేవరాంపల్లి, గోపాలపూర్ గ్రామాలతో పాటు దామెరకుంట గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామాన్ని గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది. మండల అధికారులు ఈ మూడు గ్రామాలకు సంబంధించిన విస్తీర్ణం, జనాభా, ఓటర్లు తదితర అంశాలతో కూడిన నివేదికను జిల్లా అధికారులకు ఇప్పటికే అందించినట్లు సమాచారం. మండలంలో గతంలో 18 గ్రామపంచాయతీలు ఉండగా 2016లో నూతన గ్రామపంచాయతీ చట్టం ప్రకారం ఆరు గ్రామపంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేయడంతో జీపీల సంఖ్య 24కు చేరింది. ప్రస్తుతం మరో మూడు నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు ప్రతిపాదన ముందుకురావడంతో జీపీల సంఖ్య 27కు చేరే అవకాశం ఉంది.
నేడు లక్ష్మీదేవర జాతర
పలిమెల: మండలంలోని బొడాయి గూడెంలో నేడు (సోమవారం) లక్ష్మీదేవర జాతర జరగనుంది. స్థానిక గిరిజనులు వైభవంగా భక్తిశ్రద్ధలతో ఈ జాతర నిర్వహిస్తారు. జాతరకు మండలంలోని ఆయా గ్రామాలతో పాటు చుట్టుపక్కల మండలాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని పలు గ్రామాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
జిల్లా కమిటీ ఎన్నిక
భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ ఉద్యోగుల జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వంతడుపుల రఘు, ప్రధాన కార్యదర్శిగా బానోతు భార్గవ్, గౌరవ అధ్యక్షుడిగా షేక్ ఇమామ్‌బాబా, జిల్లా కోశాధికారిగా శిరీష, అధికార ప్రతినిధి, సోషల్‌మీడియా ఇన్‌చార్జ్‌గా శంకర్, సంయుక్త కార్యదర్శిగా కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా అంజలి, రాజునాయక్, స్వామి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్, రాష్ట్ర బాధ్యులుగా ముత్యంరెడ్డి ఎన్నికయ్యారు.
‘సంప్రదాయాలను
కాపాడుకోవాలి’
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సమ్మక్క పూజారి సిద్ధబోయిన అరుణ్‌కుమార్ అన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం మేడారంలో సమ్మక్క భవనంలో ఆదివాసీ పూజారులతో సంస్కృతి పరిరక్షణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమ్మక్క– సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు పూజారులను, గ్రామస్థాయిలో ఉన్న పూజారులను కాపాడు కోవాలన్నారు. పూజారుల ద్వారా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ జరుగుతుందని, ప్రజలలో ఐక్యత వస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వనవాసీ కల్యాణ పరిషత్ ప్రాంత శ్రద్ధ జాగరణ ప్రముక్, పరుశురాములు, సమ్మక్క– సారలమ్మ ఆవాస ప్రముఖ్ సాంబయ్య, చర్పా కిసాన్‌రావు, కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.
పరిశోధన పత్రం సమర్పణ
విద్యారణ్యపురి: జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో ఈనెల 21న నిర్వహించిన రాష్ట్రస్థాయి మేథమెటిక్స్ సెమినార్‌లో కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ పోగుల అశోక్ పరిశోధన పత్రం సమర్పించారు. (పేపర్ ప్రజెంటేషన్) ‘ఎన్ హాన్సింగ్ క్వాలిఫికేషన్ టెక్నిక్స్ ఇన్ సెకండరీ స్కూల్స్ స్టూడెంట్స్ త్రూ వేదిక్ మేథమెటిక్స్’ అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఇదిలా ఉండగా.. పోగుల అశోక్ వచ్చే నెలలో జాతీయ స్థాయిలో జరగబోయే విద్యా సదస్సులోనూ పాల్గొనేందుకు ఇప్పటికే ఆయనకు అవకాశం లభించింది. జాతీయ సదస్సుకు ఎంపికై న పోగుల అశోక్‌ను విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఈసందర్భంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment