రామకోటి రాసి నిరసన
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విద్యాశాఖ సమగ్ర శిక్ష విభాగం కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. సెలవు కావడంతో పిల్లలతో కలిసి దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. రెగ్యులర్ కావాలని రామకోటి, శివకోటి రాసి నిరసన తెలిపారు. అనంతరం క్రిస్మస్ వేడుకలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ చాంద్ పాషా, తోకల వేణు మాట్లాడారు. 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని సీఎం మాటిచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా సీఎం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం బాధ్యులు కంకల రాజయ్య, చల్ల సునీత, సత్యనారాయణ, భవాని, నరేష్, కనకలక్ష్మి, రజిత, శ్రీనివాస్, నిర్మల, మహేందర్, సుదర్శన్, శ్రీలత, వరప్రసాద్, రమేష్, వసంత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment