భూనిర్వాసిత రైతులకు పరిహారం
జాతీయ రహదారి భూసేకరణపై అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: మంచిర్యాల నుంచి వరంగల్ వరకు వయా భూపాలపల్లి మీదుగా నిర్మించనున్న జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోనున్న రైతులకు ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో గురువారం అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ మంగీలాల్, భూసేకరణ విభాగం పర్యవేక్షకుడు మురళీధర్, మొగుళ్లపల్లి, టేకుమట్ల, చిట్యాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్బిట్రేషన్ ద్వారా రైతుల అభీష్టం మేరకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. ఆర్బిట్రేషన్ ద్వారా సంబంధిత రైతులకు పరిహారం చెల్లింపునకు జాతీయ రహదారుల శాఖ ద్వారా నిధులు మంజూరు అయ్యాయని, ఆర్డీఓ ద్వారా చెల్లింపు చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థనలు ఉన్న రైతులు తనకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రహదారి భద్రతా నియమాలు
పాటించాలి...
ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో రవాణాశాఖ ఆద్వర్యంలో రూపొందించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీటీఓ మహ్మద్ సంధాని తదితరులు పాల్గొన్నారు.
పీఏసీఎస్‌ల ఏర్పాటుకు చర్యలు..
రైతుల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సహకార సంఘాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో నూతన ప్రాథమిక సహకార సంఘాల ఏర్పాటుపై సహకార శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన ఐడీఓసీ సమావేశపు హాలులో సహకార సంఘాల అధ్యక్షులు, సీఈవోలు, బ్యాంకర్లతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో సహకార అధికారి వాలియానాయక్, డీఏఓ విజయభాస్కర్, ఎల్‌డీఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు చర్యలు
కలెక్టర్ రాహుల్ శర్మ
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి..
నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు. ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, తదితరులు కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకుని అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు, తదితరులు బొకేలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమని, తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చే వారు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి అందించి పేద విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలని ఇటీవల సూచించానన్నారు. ఈ మేరకు అధికారులు, అన్ని వర్గాల వారు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పరీక్ష ప్యాడ్స్ అందజేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment