సమస్యలకు తక్షణ పరిష్కారం
భూపాలపల్లి: ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 36 వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలాల్లో పరిష్కారం కాని సమస్యలనే కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి దృష్టికి తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ మంగీలాల్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి క్రీడలకు
ఎంపిక
టేకుమట్ల: హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్–19 విభాగం రాష్ట్రస్థాయి సైక్లింగ్ రోడ్ రేస్ చాంపియన్ షిప్‌లో మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన వైష్ణవి, అంజలి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై నట్లు పీడీ చాగంటి ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడలకు గ్రామీణ విద్యార్థులు ఎంపికకావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 21నుంచి 24వరకు బీహార్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో పాట్నాలో నిర్వహించే పోటీల్లో వైష్ణవి, అంజలీ పాల్గొంటారని చెప్పారు. అనంతరం విద్యార్థులను కోచ్‌లు రుజుదానైమా, మమత, జ్యోతి, పీడీలు అభినందించారు.
మున్సిపల్ కార్మికుల ధర్నా
భూపాలపల్లి అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడు రోజులుగా నిరసన దీక్షలు చేపట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, 11వ పీఅర్‌సీని ప్రకటించాలని, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని కోరారు. అర్హత కలిగిన వారికి పదోన్నతలు ఇవ్వాలని, ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని కోరారు. కనీస వేతనం నెలకు రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బండారి బాబు, బుచ్చయ్య, సురేందర్, రమేష్, శ్రీనివాస్, రవి, సారయ్య, రమేష్, సురేష్, దేవమ్మ, రాధ, స్వరూప, పద్మ పాల్గొన్నారు.
చిన్న కాళేశ్వరం పనుల అడ్డగింత
కాళేశ్వరం: చిన్న కాళేశ్వరం కెనాల్ పనులను పోలీసులను కాపలా పెట్టి తమ భూములు లాక్కుంటే ఊరుకోమని ఎలికేశ్వరం రైతులు పనులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం శివారులో కెనాల్ కోసం కాంట్రాక్టర్ జేసీబీతో పనులు చేస్తుండగా రైతులు కుటుంబసభ్యులతో చేరుకొని అడ్డుకుని రెవెన్యూ అధికారులతో వాగ్వాదం చేశారు. అధికారులు సర్వేచేసి మార్కెట్ విలువ కంటే రెండింతలు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ప్రహ్లాద్‌రాథోడ్, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఆర్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈఈ భరత్ రైతులకు ఎంత నచ్చచెప్పినా వినలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో మహదేవపూర్ ఎస్సై పవన్‌కుమార్, ట్రైయినీ ఎస్సై అమూల్య వారి సిబ్బందితో ఎలికేశ్వరం చేరుకొని గొడవ జరుగకుండా చర్యలు చేపట్టారు. రైతులు కలెక్టర్ వద్దకు వెళ్లి తమ భూముల విషయంలో ఫిర్యాదు చేస్తామని కలెక్టరేట్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment