నిర్మాణ పనుసు జరుగుతున్న ఏటీసీ భవనం
ఆరు కోర్సుల్లో శిక్షణ
ప్రారంభమైన తరగతులు
త్వరలోనే ప్రాక్టికల్ క్లాసులు
కళాశాలకు చేరుకున్న యంత్ర పరికరాలు
శిక్షణ పూర్తిచేసుకునే విద్యార్థులకు ఉపాధి మార్గాలు
భూపాలపల్లి అర్బన్: ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పట్టభద్రులకు అపార అత్యాధునిక ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)లుగా ఆధునీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.
ఈ కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐల సిలబస్ ఉండాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న రెండు ఐటీఐ కళాశాలల్లోనూ సంస్కరణలు మొదలయ్యాయి. ఈ మేరకు పాలిటెక్నిక్ కళాశాలలో కొత్త ఏటీసీల ఏర్పాటును పరిశీలించేలా చర్యలు తీసుకోనున్నారు. స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ, పాలిటెక్నిక్, ఏటీసీ కళాశాలను తీసుకువచ్చే విధంగా కార్యాచరణ సిద్ధమైంది. రూ.2,400 కోట్లతో టాటా సంస్థ, ప్రభుత్వం కలిసి రాష్ట్రంలోని 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) మార్చనున్నారు.
వీటి అభివృద్ధికి 86శాతం టాటా సంస్థ, 14 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు అందించి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు. జనవరి 31వ తేదీ వరకు పనులు పూర్తిచేయాలని వేగవంతంగా చేస్తున్నారు. జనవరి 15వ తేదీన ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా నిర్మాణ పనులు పూర్తికాలేదు.
ఏటీసీలో ఆరు కోర్సులు
జిల్లాలో భూపాలపల్లి, కాటారంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ప్రతి ఏడాది 300మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. వీటిలో ప్రస్తుతం ఆరు కోర్సులైన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, అర్టిసన్ యుసింగ్ అడ్వాన్డ్స్ టూల్స్, బేసిక్ డిసైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ (మెకానికల్), అడ్వాన్డ్‌స్ సీఎన్‌సీ మేషనింగ్ టెక్నిషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ కోర్సులను ప్రవేశపెట్టనుండగా భవిష్యత్‌లో 20 రకాలైన అత్యాధునిక కోర్సులకు డిమాండ్‌కు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పాఠ్యాంశాల బోధన జరుగుతుండగా ప్రారంభోత్సవాల అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహణ, ఉద్యోగ మేళా కార్యక్రమాలను కూడా టాటా సంస్థ చేపట్టనుంది.
కోర్సు పేరు, కాల వ్యవధి, సీట్లు
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్; 1 సంవత్సరం; 40
ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్; 1 సంవత్సరం; 40
అర్టిసన్ యుసింగ్ అడ్వాన్డ్స్ టూల్స్; 1 సంవత్సరం; 40
బేసిక్ డిసైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ (మెకానికల్); 2 సంవత్సరాలు; 24
అడ్వాన్డ్స్ సీఎన్‌సీ మేషనింగ్ టెక్నీషియన్; 2 సంవత్సరాలు; 24
మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్; 2 సంవత్సరాలు; 24
Comments
Please login to add a commentAdd a comment