హేమాచల క్షేత్రంలో ఏఎస్పీ పూజలు
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ దంపతులు వారి కుటుంబ సభ్యులతో ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం పూజారులు స్వాగతం పలికారు. అనంతరం ఏఎస్పీ దంపతులు, వారి కుటుంబ సభ్యుల పేరిట స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేష వస్త్రాలు బహుకరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.
వందలాదిగా తరలివచ్చిన భక్తులు..
ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, వివిద ప్రైవేట్ బస్సులు తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వయంభు స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, స్వామివారికి తిల తైలాభిషేకం పూజలు నిర్వహించారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి శఠారితో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు. భక్తులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment