మా పేరు లేదు..!
రేషన్‌కార్డు దరఖాస్తుల సర్వే జాబితాలో పేర్లు గల్లంతు
● కుల గణన సర్వే, ప్రజాపాలనలో
దరఖాస్తు ఇచ్చినా జాబితాలో లేని వైనం
● ఆందోళన చెందుతున్న
పేద కుటుంబాలు
● మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చంటున్న అధికారులు
భూపాలపల్లి/రేగొండ: రేషన్‌కార్డుల సర్వే జాబితాలో వేలాది కుటుంబాల పేర్లు గల్లంతయ్యాయి. కుల గణన సర్వే, ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినా జాబితాలో పేర్లు రాకపోవడంతో అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారు. పదేళ్లుగా కార్డుల కోసం వేచి చూసినా.. మళ్లీ నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాబితాలో 8,191 కుటుంబాలే..
జిల్లాలోని 12 మండలాల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు సుమారు 1,23,659 ఉన్నాయి. గడిచిన పదేళ్లుగా కొత్త కార్డులను మంజూరు చేయలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా సుమారు 22వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వం 2024 ఫిబ్రవరి నెలలో ప్రజాపాలనలో భాగంగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. మళ్లీ ఇటీవల కుల గణన సర్వే చేపట్టింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌లో స్వీకరించిన దరఖాస్తులు, ప్రజాపాలనలో స్వీకరించిన వాటిని పరిగణలోకి తీసుకోకుండా కుల గణన సర్వేలో వెల్లడించిన వివరాల ఆధారంగానే రేషన్‌కార్డు లేని కుటుంబాల జాబితాను తయారు చేశారు. ఈ మేరకు జిల్లాలో 8,191 కుటుంబాలను గుర్తించి సర్వే చేపడుతున్నారు.
ఆందోళనలో అర్హులు..
వివాహాలు చేసుకొని తల్లితండ్రుల నుంచి విడిపోయిన వారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన కుటుంబాలు జిల్లాలో సుమారు 22వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పలుసార్లు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుత సర్వే జాబితాలో సగానికి పైగా కుటుంబాల పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పదేళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నామని, మళ్లీ నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో జాబితాలో పేర్లు లేని వారు పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కూలీ పని చేసుకొని బతికే తమ పేర్లు జాబితాలో ఎందుకు రాలేదని సర్వేకు వచ్చిన అధికారులను నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా జాబితాలో విశ్రాంత ఉద్యోగులు, బడా వ్యాపారుల కుటుంబాల పేర్లు ఉండటం గమనార్హం.
సర్వే జాబితాలో ఉన్న దరఖాస్తుదారుల సంఖ్య
మండలం కుటుంబాల
సంఖ్య
మహాముత్తారం 583
మల్హర్ 556
మహదేవపూర్ 728
పలిమెల 315
కాటారం 803
టేకుమట్ల 485
కొత్తపల్లిగోరి 406
చిట్యాల 676
రేగొండ 687
గణపురం 691
మొగుళ్లపల్లి 577
భూపాలపల్లి రూరల్ 804
భూపాలపల్లి
మున్సిపాలిటీ 880
మొత్తం 8191
Comments
Please login to add a commentAdd a comment