పారదర్శకంగా సర్వే
మల్హర్: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వే పారదర్శకంగా నిర్వహించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ సూచించారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న రైతుభరోసా సర్వేను సబ్ కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్యామ్‌సుందర్, సర్వే టీం సభ్యులు ఉన్నారు.
పెండింగ్ పనులు ప్రారంభం
కాళేశ్వరం: కాళేశ్వరాలయ పెండింగ్ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరయ్యాయి. ఎండోమెంట్ శాఖ పనులు పూర్తికాగా.. పంచాయతీరాజ్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చేనెల కుంభాభిషేకం, మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో పెండింగ్ పనులపై అధికారులు దృష్టిసారించారు. ఆలయ రాజగోపురం నుంచి రామాలయం వరకు రూ. 50లక్షలతో మెట్లమార్గం నిర్మాణం పనులు వారం కిందట ప్రారంభించారు. రూ.8కోట్ల వ్యయంతో చేపట్టిన వందగదులు(86)భవనం పనులు కాంట్రాక్టర్లకు ఎస్టిమేషన్‌లు పెరుగడంతో వదిలేశారు. మళ్లీ ఇటీవల షార్ట్‌టెండర్‌కు అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. ఆదివారం ఆ వంద గదుల నిర్మాణం పనులు కాంట్రాక్టర్ ప్రారంభించారు. చుట్టూరా డోజర్, జేసీబీలతో పనులు మొదటు పెట్టారు.
నేడు నల్లబ్యాడ్జీలతో నిరసన
భూపాలపల్లి అర్బన్: మతోన్మాద శక్తుల జోక్యాన్ని నిరసిస్తూ నేడు(సోమవారం) జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టనున్నట్లు ఆయా సంఘాల నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు చేసిన ఘటనలకు వ్యతిరేకం చేపట్టనున్న నిరసనలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
‘కుసుమ్’ దరఖాస్తులు నిల్
ఏటూరునాగారం: పోడు భూములకు హక్కుపత్రాలు కలిగి ఉన్న గిరిజన రైతులు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుచేసుకునేందుకు పీఎం కుసుమ్ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించగా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కటి కూడా రాలేదు. ఐటీడీఏ పరిధిలోని పోడు భూముల్లో నాలుగు ఎకరాలు కలిగి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా లేదా రెవెన్యూ పట్టా కలిగి ఉన్న రైతుల నుంచి భూములను 25 సంవత్సరాలపాటు లీజుకు తీసుకొని ఆ భూములకు ఎకరానికి సంవత్సరానికి రూ.12,500 చెల్లించనున్నారు. ఈ విధంగా నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహించనున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15నుంచి 19వరకు అవకాశం ఇచ్చినప్పటికీ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. గిరిజన రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఏటీడీఓ క్షేత్రయ్యను వివరణ కోరగా పీఎం కుసుమ్ పథకం గురించి అనుమానాలు అడుగుతున్నారని, ఎవరు కూడా ఇంత వరకు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు.
నాణ్యతా ప్రమాణాలతో చెరువు పనులు
వెంకటాపురం(ఎం): మారేడు గుండ చెరువు మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండలంలోని మారేడుగొండ చెరువు మరమ్మతు పనులకు రూ.2.86 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఆదివారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం అకాల వర్షాలతో మారేడుగొండ చెరువు కట్ట పూర్తిగా తెగి ప్రాణనష్టంతో పాటు పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment