అక్రమాలకు చెక్
కాటారం: ఉపాధిహామీ పనుల్లో పారదర్శకతను పెంచి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు అనేక సంస్కరణలు తెస్తున్నాయి. పనుల గుర్తింపు, పనుల నిర్వహణ, కూలీలకు డబ్బుల చెల్లింపు లాంటి అంశాల్లో అవినీతి చోటు చేసుకోకుండా కేంద్రం ఉపాధిహామీ పథకంలో ఇటీవల అనేక మార్పులు తీసుకొచ్చింది. కూలీల వేతనాలు దుర్విని యోగం కాకుండా లబ్ధిదారుడికి బ్యాంకు, పో స్టాఫీస్ ఖాతాలు తెరిచి నేరుగా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఒకరికే రెండు, మూడు ఖాతాలు ఉండటంతో కూలీ డబ్బులు ఏఖాతా లో.. ఎంత జమ అవుతున్నాయో తెలుసుకో వడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా జన్‌మన్‌రేగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా కూలీలు ఎన్ని రోజులు పని చేశారు. ఎంత కూలీ వచ్చింది, ఎక్కడ పనులు జరిగాయి.. ఎన్ని డబ్బులు చెల్లించారు. ఇంకెంత చెల్లించాలి వంటి సమాచారం తెలుసుకోవచ్చు.
అరచేతిలో సమాచారం
ఉపాధిహామీ పథకానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. కూలీలకు అరచేతిలో సమాచారం లభించేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి జన్‌మన్‌రేగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇందులో కూలీల వేతనాలు, పని దినాలకు సంబంధించిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ, కుటుంబం ఐడీ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ ఆప్షన్‌లోకి వెళ్లి వ్యక్తి పేరు మీద క్లిక్ చేస్తే ఎక్కడ పని చేశారు. పని దినాల సంఖ్య, ఎంత వేతనం, ఎప్పుడు జమ చేశారు, ఏ బ్యాంకులో వేశారు వివరాలు ఉంటాయి. ఉపాధిహామీ డబ్బులు జమ కాకుంటే సదరు లబ్ధిదారుడి ఖాతాకు సంబంధించిన ఆధార్ లింకు అయిందా, ఆధార్‌లో పోలిన విధంగా బ్యాంకు వివరాలు ఉన్నాయా..? ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టం లింక్ అయిందో లేదో వివరాలు సరి చూసుకునే వీలు ఉంది. ఒకవేళ అన్ని వివరాలు లింకై తే పచ్చరంగులో రైట్ గుర్తు ఉంటుంది. లేదంటే ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఎరుపు రంగు గుర్తు చూపుతుంది. జాబ్‌కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. అందుకు అటెండెన్స్ అప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఏ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజులు పని చేశారు. ఎవరెవరు ఎన్ని రోజలు పనిచేశారో వివరాలు కనిపిస్తాయి. ప్రతి వివరాలు కూలీకి స్వయంగా తెలుసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీని ద్వారా ఉపాధిహామీ పథకంలో మరింత పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
పథకం పటిష్టత దిశగా..
గ్రామాల్లో వలసలు తగ్గించి స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో అవినీతి, అక్రమాలు విచ్చల విడిగా చోటు చేసుకోగా కాలక్రమేణా కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చి అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. గత మూడేళ్లుగా ఉపాధిహామీ పథకాన్ని పటిష్టం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటుంది. కూలీల లైవ్ లొకేషన్, వర్క్ వీడియో అప్‌లోడ్, ఆన్‌లైన్ అటెండెన్స్ లాంటివి తీసుకొచ్చి అక్రమాలకు చెక్‌పెట్టింది. పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు నూతన టెక్నాలజీని వినియోగించి అసలైన కూలీలకు లబ్ధిచేకూరేలా చర్యలకు చేపడుతుంది.
అవగాహన కల్పిస్తున్నాం..
ఉపాధి కూలీల వేతనాల చెల్లింపుల్లో అక్రమాలకు తావు లేకుండా కేంద్రం జన్‌మన్‌రేగా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా కూలీలు పనులకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇది కూలీలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా కూలీలకు యాప్‌పై అవగాహన కల్పిస్తున్నాం.
– నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
జిల్లాలో
ఈజీఎస్ వివరాలు
జాబ్ కార్డులు
1,10,192
ఉపాధి కూలీలు2,42,721
జన్‌మన్‌రేగా యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఈజీఎస్ అమలు పారదర్శకతపై కేంద్రం దృష్టి
కూలీలకు అరచేతిలో సమాచారం
Comments
Please login to add a commentAdd a comment