అడుగేయాలంటే భయమే..!
ఏటూరునాగారం: తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో అడుగు తీసి అడుగేయాలంటేనే ఏజెన్సీ ప్రజలు జంకుతున్నారు. ఏ గుట్టలో.. చెట్టు పొదల్లో ఏ ల్యాండ్‌మైన్స్ ఉన్నాయోనని తెలియక భయాందోళన చెందుతున్నారు. ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో ప్రజలు నిత్యం వంట చెరుకు, అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవికి వెళ్తుంటారు. వారికి కావాల్సిన వాటికోసం గుట్టలు, దట్టమైన అడవుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మావోయిస్టులు ఏర్పాటు చేస్తున్న ల్యాండ్‌మైన్స్ పేలి మృత్యువాత పడుతుండడంతో పాటు కాళ్లు, చేతులు కోల్పోయి మంచాలకే పరిమితం అవుతున్నారు.
పోలీసులే టార్గెట్.. అమాయకులు బలి
పోలీసులు కూంబింగ్‌కు వస్తారని అడవిలోని పలు దారుల్లో మావోయిస్టులు బీరు, ప్రెషర్, ల్యాండ్‌మైన్స్, నాటు బాంబులను అమర్చుతున్నారు. అయితే ఇవేమీ తెలియని ఏజెన్సీలోని అమాయక ప్రజలు ల్యాండ్‌మైన్స్‌పై కాలువేసి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మరికొందరు కాళ్లు, చేతులు కోల్పోయి మంచాలకే పరిమితమై దివ్యాంగులుగా మారుతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకొని అమర్చుతున్న మందుపాతర్లకు అమాయకులు బలికావడం తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పరిపాటిగా మారింది. దీంతో అడవుల్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.
అటవీ ప్రాంతంలో
చోటుచేసుకున్న పలు ఘటనలు
2024 జూన్ 3న వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు ల్యాండ్‌మైన్‌పై కాలు వేసి మృత్యువాత పడ్డాడు. అలాగే వెంకటాపురం(కె) మండలం ముకునూనుపాలెంకు చెందిన పెంటయ్య వంట చెరుకు కోసం అడవికి వెళ్లగా మందుపాతర పేలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అదే విధంగా వీరభద్రవరం గ్రామ అటవీప్రాంతంలో జూన్ 9న మావోయిస్టులు అమర్చిన నాలుగు మందుపాతర్లను పోలీసులు గుర్తించారు. అప్పటికే మూడు మందుపాతర్లు పేలి ఒక ముళ్లపంది, కొండెగ, పెంపుడు కుక్క చనిపోయింది. అదే ప్రాంతంలో మరో మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. తాజాగా ఆదివారం సాయంత్రం అంకన్నగూడెం గ్రామానికి చెందిన కుర్సం యడమయ్య, బొగ్గుల నవీన్, నర్సింహరావులు కలిసి చెలిమల అటవీప్రాంతంలో వంట చెరుకు కోసం వెళ్లగా ప్రెషర్ బాంబు పేలి నవీన్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.
పోలీసులే టార్గెట్‌గా అడవిలో మావోయిస్టుల ల్యాండ్‌మైన్స్
ప్రజలు వంటచెరుకు, అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్తుండగా పేలుళ్లు
మృత్యువాత పడుతున్న అమాయకులు
మరికొందరు కాళ్లు, చేతులు
కోల్పోతున్న క్షతగాత్రులు
Comments
Please login to add a commentAdd a comment