ఎన్నికల నియమావళిని అమలు చేయాలి
భూపాలపల్లి: జిల్లాలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ జిల్లాలో తక్షణమే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టిక్కర్లు తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.
టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలి..
జిల్లాలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో అటవీ, దేవాదాయ, ఆర్కియాలజీ మ్యూజియం, విద్యా, ఇరిగేషన్, పర్యాటక శాఖ, పర్యాటక సంస్థ, సమాచార, యువజన సర్వీసులు, మైనార్టీ శాఖల అధికారులతో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ద్వారా మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజి, పర్యాటక శాఖ డీఈ ధనరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి...
నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో నేషనల్ డి వార్మింగ్ డే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10న మాత్రలు తీసుకోని వారికి తిరిగి 17వ తేదీన ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 69,652 మందిని గుర్తించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వైద్యాధికారులు పాల్గొన్నారు.
పుస్తకాలు అందుబాటులో ఉంచాలి..
పోటీ పరీక్షలకు సిద్ధపడే వారి కోసం పుస్తకాలు అందుబాటులో ఉంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎల్ విజయలక్ష్మి సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం గ్రంథాలయ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన వివరాలు మరియు 2025–2026 బడ్జెట్ అంచనాల ఆమోదం కోసం పంపేందుకు అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో డీపీఓ నారాయణరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శైలజ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి టి శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి ఇబ్బంది రానివ్వొద్దు
వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా రానున్న 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో గ్రామ పంచాయతీ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలలో నిరుపయోగంగా ఉన్న బోర్లు, చేతి పంపులు, పైపులైన్ లీకేజీలు, కొత్త పైపులైన్ల ఏర్పాటు, గేట్ వాల్స్ లీకేజీలను గుర్తించి నివేదిక అందజేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment