హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు
భూపాలపల్లి: హెల్మెట్ ధరించడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం రవాణా మరియు పోలీసుశాఖల ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయం నుంచి గణేష్ చౌక్ మీదుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ వరకు బైక్‌లపై హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ప్రారంభించారు. ర్యాలీలో భాగంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు ఎస్పీ బోనాల కిషన్ హెల్మెట్‌లు ధరించి బైక్‌లు నడిపారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ... దేశంలో సగటున 70 శాతం రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం మూలంగానే ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడైందని, ఇది చాలా బాధాకరమన్నారు. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. యువత ఎక్కువగా బైక్‌లపై రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం పలువురు డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఓ మహ్మద్ సంధాని, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, డాక్టర్ కేఎస్ కిరణ్, ఇతర శాఖలు, సింగరేణి, కేటీపీపీ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3 నోటిఫికేషన్ రానుందని, మార్చి 8న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అందరూ పాటించాలని, ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే
Comments
Please login to add a commentAdd a comment