వస్తున్నాం.. లింగమయ్యా | Sakshi
Sakshi News home page

వస్తున్నాం.. లింగమయ్యా

Published Tue, Apr 23 2024 8:20 AM

జలపాతం వద్ద స్నానాలు చేస్తున్న భక్తులు - Sakshi

అచ్చంపేట/అమ్రాబాద్‌: తెలంగాణ అమరనాథ్‌ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభయ్యాయి. పున్నమికి ముందురోజు మదినిండా లింగమయ్యను స్మరించుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల బాటపట్టారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా..’ అంటూ దట్టమైన అడవిలో లోయలు, గుట్టలు దాటుకుంటూ సాహస యాత్రలో ఉత్సాహంగా ముందుకు కదిలారు. గతంతో పోల్చితే సోమవారం భక్తుల తాకిడి పెద్దగా కనిపించలేదు. భగభగమండుతున్న ఎండల్లో పగటి వేళ ప్రయాణం చేయలేకపోవడం ఒకటైతే.. అటవీ శాఖ రాత్రివేళ భక్తులను అనుంతిచకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. మరోవైపు అటవీశాఖ ఐదురోజుల జాతరను మూడురోజులకు కుదించడం, రాత్రి సమయంలో భక్తులను అనుమతించకపోవడంతో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకొనేందుకు భక్తులు పగలే బారులుతీరారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇరుకై న కొండ, కోనల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు ఆచరించి.. లింగమయ్యను దర్శించుకొని తరించారు.

బారులుతీరిన వాహనాలు

ఫర్హాబాద్‌ నుంచి రాంపూర్‌ చెంచుపెంట వరకు వాహనాలు బారులుదీరాయి. మరోమార్గమైన అప్పాయిపల్లి– గిరిజన గుండాల వద్ద జన సందోహం నిండుగా కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లోయలో పైనుంచి జాలువారుతున్న నీటి ధారలో యువకులు కేరింతలు కొడుతూ సేదతీరారు. లింగమయ్యను దర్శించుకునే క్రమంలో అలసిపోయిన భక్తులు పొంచి ఉన్న ప్రమాదాలను లెక్క చేయకుండా చెట్లు, పుట్టలు, గుట్టల నడుమ సేదతీరుతున్నారు. ఆలయం, జలపాతం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా వలంటీర్లు సహకారం అందిస్తున్నారు.

అన్నదానం.. తాగునీటి వసతి

లేశ్వరం వచ్చే భక్తుల కోసం మోకాళ్ల కురువ, అప్పాయిపల్లి మార్గంలోని గిరిజన గుండాల వద్ద స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం, చలివేంద్రాలు భక్తులను ఆదుకుంటున్నాయి. అల్పాహారం మొదలుకొని మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనాలు, రాగి అంబలి, మజ్జిగ, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్‌ చెక్‌పోస్టు, పుల్లాయిపల్లి బేస్‌ క్యాంపు, రాంపూర్‌ పెంట, మోకాళ్ల కుర్వు (సలేశ్వరం), లింగాల మండలం అప్పాయిపల్లి, గిరిజన గుండాల వద్ద 5 వేల లీటర్ల వాటర్‌ ట్యాంకులు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతలు ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలలతో పాటు 20 ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. మూడు రోజులపాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు డీఈ హేమలత తెలిపారు.

నిరంతర పర్యవేక్షణ

పోలీస్‌, అటవీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాయి. సీసీ, ట్రాప్‌ కెమెరాల ద్వారా అడవి మార్గంలో నిరంతర పర్యవేక్షణ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్‌– రాంపూర్‌– సలేశ్వరం క్షేత్రం వరకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.

పుల్లాయిపల్లి వరకే బస్సులు

సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అయితే పుల్లాయిపల్లి పెంట వరకు మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. అక్కడి నుంచి మోకాళ్ల కురువ చేరుకునేందుకు 50 ఆటోలు అందుబాటులో ఉంచారు. రాంపూర్‌ వరకు ఉన్న రోడ్డు పరిస్థితి, వర్షం పడితే కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుస్తుగా పుల్లాయిపల్లి వరకు బస్సులను అనుమతించారు. 20 నిమిషాలు ఒక బస్సు చొప్పున ప్రయాణికులకు వీలుగా నడిపిస్తున్నారు. సోమవారం అచ్చంపేట డిపో నుంచి 16, నాగర్‌కర్నూల్‌ 23, కొల్లాపూర్‌ 4, కల్వకుర్తి 4 బస్సుల చొప్పున మొదటి రోజు పుల్లాయిపల్లి వరకు బస్సులు నడిపించారు.

వైభవంగా ప్రారంభమైన సలేశ్వరం ఉత్సవాలు

మొదటిరోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు

పగటిపూట అనుమతి, ఎండల తీవ్రతతో అవస్థల పాలు

తెలంగాణ అమరనాథ్‌ సాహస యాత్రకు క్యూకట్టిన జనం

నట్టడవిలో మార్మోగుతున్న లింగమయ్యనామస్మరణ

1/3

కొండచరియల్లో కాలినడకన భక్తులు
2/3

కొండచరియల్లో కాలినడకన భక్తులు

3/3

Advertisement
Advertisement