641.411 మి.యూ. విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోని దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. బుధవారం 9 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ సూరిబాబు తెలిపారు. ఎగువ 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 328.224 మి.యూ., దిగువ 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 313.187 మి.యూ. ఉత్పత్తి సాధించామన్నారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 641.411 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ఇందుకుగాను 18,466 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం
అమరచింత: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను సంఘటితంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ కోరారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం మూడో మండలస్థాయి మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, అమరులైన వీరులకు సంతాపం ప్రకటిస్తూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా విధ్వేషాలు సృష్టిస్తున్నాయని.. కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా అణగారినవర్గాల అభ్యున్నతిని విస్మరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమ పెట్టుబడిదారి పంథాను మార్చుకోరని, వ్యవస్థలో అసమానతలు ఉండాలని కోరుకోవడం పెట్టుబడిదారీ విధానం సహజ లక్షణమన్నారు. మతోన్మాదం, ఆర్థిక సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని కోరారు. బీజేపీ పాలనలో రాజ్యాంగబద్ద సంస్థలు నిర్వీర్యమయ్యాయని.. అన్ని వ్యవస్థల్లో రాజకీయ జోక్యం పెరిగి విజ్ఞానశాస్త్రం వెనక్కు వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment