వెలుగులకే అందాలు.. మట్టి ప్రమిదలు
వైవిద్యభరితంగా ప్రమిదలు
గద్వాలటౌన్: ఎర్ర మట్టితో జీవం పోసుకునే బొమ్మలతో కూడిన ప్రమిదలంటే ఎంతో ప్రేమ. ప్రాచీన కళాసాంప్రదాయమైన ఈ కళాప్రక్రియకు ఎప్పటికప్పుడు ఆధునికతను జత చేసుకొని నిత్య శోభను సంతరించుకునే మట్టి ప్రమిదలు దీపావళి పండగను పురస్కరించుకొని కొత్త భూమికతో గద్వాలకి చుట్టపు చూపుగా వచ్చాయి. హారతులు అందించేందుకు అందంగా ముస్తాబై చుట్టు పక్కల ప్రజలను స్వాగతిస్తున్నాయి.
ఎన్నెన్నో అందాలు..
అమావాస్య చీకటిని సైతం లెక్కచేయకుండా కాంతులీనడానికి ఇంటింటా సమాహారమయ్యే దీపపు కుందెలు, ప్రమిదలు దీపావళి పండగలో ముఖ్య భూమికను పోషిస్తుంటాయి. శుభానికి చిరునామాగా పసుపు, పారాణి అలంకరణతో ముస్తాబైన ఇంటి గడప, ప్రహరి, ప్రాంగణం, వాకిళ్లలో ఒక్కొక్కటిగా జతయ్యి.. పసిడికాంతుల్ని నింపుతూ భారతీయ సాంప్రదాయాన్ని ఆవిష్కరించే ప్రమిదల కొలువు దీపావళి వేడుకల్లో చూసి తీరాల్సిందే. ఈ ప్రత్యేకతను పురస్కరించుకొని స్థానికంగా కొంత మంది వ్యాపారులు వివిధ రూపాల్లో రూపొందించిన ప్రమిదలను హైదరాబాద్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి మట్టి, సిరామిక్ దీపాలను గద్వాలకు తీసుకవచ్చి విక్రయిస్తున్నారు. డిజైన్‌ను బట్టి జత రూ.30 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రమిదలు కొలువుదీరాయి.
ఆకర్షణ, వైవిద్యం...
దీపపు ప్రమిదలనగానే అర్ధచంద్రాకారాల్లో ఉండే ప్రమిద జ్యోతులు గుర్తు కొస్తుంటాయి. చేతిలో ఇట్టే ఇమిడిపోయే చిన్నపాటి ప్రమిదలతోపాటు అటు సాంప్రదాయాన్ని, ఇటు వైవిద్యం, నవ్యత కలబోసుకున్న ఆకర్షణీయమైన డిజైన్లతో ప్రమిదలు ఇక్కడ అందంగా కొలువు దీరాయి. ప్రమిదల కొనుగోలుతో ఈ ప్రాంతం సందడిగా మారింది. ఇప్పటికే మహిళలు ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ప్రమిదల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఆకట్టుకుంటున్న విభిన్న ఆకృతులు
దీపావళిలో ఎంతో ప్రత్యేకం
దీపాలు వెలిగిస్తే శుభం..
దీపావళి పండగకు దీప తోరణాలు వెలిగించే ఆచారం ఉంది. ఆరోజు శ్రీ మహాలక్ష్మిదేవి భూలోకానికి వచ్చి ఇంటింటికీ తిరుగుతుందని నమ్మకం. అందుకే ప్రజలు లక్ష్మిదేవికి నీరాజనాలు పలుకుతూ తమ ఇంట్లో, బయట దీపాలు వెలిగిస్తారు. దీపాల వరుసను వృత్తాకారంలో, స్వస్తిక్ ఆకారంలోనూ పేర్చి వెలిగిస్తే మరింత మంచిది.
– రేణుక, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment