పశువులకు టీకాలు తప్పనిసరి
ఎర్రవల్లి: గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను ప్రతి పశువులకు తప్పకుండా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని రాజశ్రీ గార్లపాడులో మండల పశువైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలతో పాటు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై పశువులను స్వయంగా పరీక్షించి పలు పశువులకు టీకా వేశారు. అనంతరం మాట్లాడుతూ గేదెలు, తెల్లజాతి పశువులలో గాలికుంటు వ్యాది అధికంగా వస్తుందన్నారు. ప్రతి గ్రామానికి మండల పశువైధ్య సిబ్బంది తిరిగి పశువులకు టీకాలను వేస్తారన్నారు. సరైన పోషణతో సకాలంలో పశువులు చూడి కట్టడం, పాల ఉత్పత్తి, దూడల యాజమాన్యం సాధ్యమని తెలిపారు. ఐదు ఆవులకు, 16 గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పశువైద్యులు డాక్టర్ వెంకటరాజు, డాక్టర్ శంకరయ్య, డాక్టర్ శిరీష, డాక్టర్ ప్రియాంక, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment