పౌష్టికాహారంతో రక్తహీనతను నివారిద్దాం
అడ్డాకుల: మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తోందని.. రక్తహీనత నివారణకు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ ద్వారా మూసాపేట మండలం జానంపేట పీహెచ్‌సీ పక్కన ఏర్పాటు చేసిన మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ (ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ)ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా జానంపేటలో ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. న్యూట్రీషియన్ చెప్పిన విధంగా అందరూ సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్య దేశంగా మారుతుందన్నారు. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ కృషి మూలంగానే కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మన దేశం సొంతం చేసుకుందన్నారు. ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ కేంద్రం ఏర్పాటు చేయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త డా.భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ సమాజానికి పరిశోధన ఫలితాలను అందించడానికి, ఆరోగ్య పరిశోధన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్‌ఐఎన్ ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు డా.ఉదయ్‌కుమార్, డా. జీఎం సుబ్బారావు, డా. జేజే బాబు, డా. ఆర్లప్ప, డా. మహేశ్వర్, టెక్నికల్ ఆఫీసర్ హృషికేష్ పండ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నియోజకవర్గ నేత కొండా ప్రశాంత్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో మొట్టమొదటి కేంద్రం..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2013లో మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2014 నుంచి దేశవ్యాప్తంగా 34 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాతాశిశు మరణాలు, రక్తహీనత, గుండె సంబంధిత సమస్యలను ఎక్కువగా గుర్తించగా.. వాటిపై ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ ద్వారా పరిశోధనలు చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కేంద్రం పనిచేస్తుందని నోడల్ ఆఫీసర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇక్కడ కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
జానంపేటలో ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూకేంద్రం ప్రారంభం
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచన
Comments
Please login to add a commentAdd a comment