అటకెక్కిన ప్లాస్టిక్ నిషేధం
గద్వాలటౌన్: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది జూలై 1న ఉత్తర్వులు జారీ చేశాయి. అప్పటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ.. వ్యాపారుల వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. 120 మైక్రాన్లలోపు ఉండే కవర్లు, వస్తువులను తయారు చేయడం, అమ్మడం, వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. కొంత మందికి జరిమానాలు సైతం విధించారు. కొద్ది రోజులపాటు హడావుడి చేసిన అధికార యంత్రాంగం.. ఆ తర్వాత ప్లాస్టిక్ నిషేధాన్ని అటకెక్కించారు.
మార్పు వచ్చే సమయంలో..
జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం పాటిస్తూ వ్యాపారులు నిషేధిత కవర్ల వినియోగించడాన్ని నిలిపివేశారు. చేతిసంచులు తీసుకురావాలని వ్యాపారులు సూచించడంతో ప్రజలు కూడా ఇంటి నుంచే సంచులు తీసుకెళ్లడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురాడంతో వెనక్కి తగ్గి తనిఖీలను నిలిపివేశారు. ఆ తర్వాత వ్యాపారులు అన్ని వస్తువులను ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తుండటంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌మయమైంది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల విక్రయం, వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో సైతం ఆర్భాటమే తప్ప.. ఆచరణ కనిపించడం లేదు. కేవలం చెత్త సేకరణ ట్రాక్టర్ల మైకు ద్వారానే ప్రచారం చేస్తున్నారు తప్పితే.. క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ నిషేదానికి తీసుకున్న చర్యలు శూన్యంగా మారాయి.
కనిపించని తనిఖీలు..
మున్సిపాలిటీల్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుపరిచేందుకు సిటీ లెవల్ టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో కమిషనర్, శానిటరీ సూపర్‌వైజర్లు, పోలీసు కానిస్టేబుల్ సభ్యులుగా ఉంటారు. వీరంతా రోజు దుకాణ సముదాయాలను తనిఖీలు చేయడంతో పాటు ప్రజలు ప్రత్యామ్నాయంగా వాడుకునే వస్తువుల గురించి వివరించాల్సి ఉంటుంది. ఈ కమిటీ తనిఖీలు ఎక్కడా కనిపించడం లేదు.
స్వచ్ఛ ర్యాంకులపై ప్రభావం..
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో ప్లాస్టిక్ నిషేధం అమలుతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలకు మార్కులు కేటాయిస్తారు. ప్రస్తుతం మున్సిపల్ పట్టణాల్లో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఈ విభాగంలో ఎక్కడా మార్కులు పడే అవకాశం కనిపించడం లేదు.
అవగాహన కల్పిస్తున్నాం..
గతేడాది నుంచే ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అధికారులు, సిబ్బందితో కలిసి దాడులు చేసి ప్లాస్టిక్ విక్రయాలను అడ్డుకుంటున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం నిర్మూలన సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలతో పాటు దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం.
– బీఎస్ కేశవ్, మున్సిపల్ చైర్మన్, గద్వాల
మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా పాలిథిన్ కవర్ల వినియోగం
నియంత్రణపై చర్యలు శూన్యం
కనిపించని సిటీ లెవల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment