కేజీబీవీల్లో కుంటుపడిన బోధన
● సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మెతో
నిలిచిన కార్యకలాపాలు
● ముందుకు సాగని విద్యార్థినుల చదువు
● ఆందోళనలో తల్లిదండ్రులు
డిమాండ్లు ఇవే...
● 20 ఏళ్లుగా తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు కనీస వేతన చట్టం అమలుచేయాలి.
● రూ.10 లక్షల జీవిత బీమా, రూ. 5లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేయాలి.
● పీఈటీలకు, ఇతర భోదనేతర సిబ్బందికి సాధారణ ఉద్యోగుల మాదిరిగా ఏడాదికి 12 నెలల వేతనం ఇవ్వాలి.
● పదవీ విరమణ సమయంలో రూ. 20 లక్షలు ఇవ్వాలి.
గద్వాలటౌన్: ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు (ఎస్‌ఓ), క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (సీఆర్టీలు) సమ్మెకు దిగారు. ఈ నెల 10 నుంచి కేజీబీవీల్లో విధులను బహిష్కరించడంతో విద్యాబోధన నిలిచిపోయింది. దీంతో విద్యార్థినుల చదువు ముందుకు సాగడం లేదు. మరోవైపు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న వీరికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో వారు సమ్మెను తీవ్రరూపం చేశారు. సమస్య త్వరగా పరిష్కారం కాకుంటే.. కేజీబీవీల్లో బోధన అటకెక్కడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లావ్యాప్తంగా 12 కేజీబీవీలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. అందులో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. సుమారు 3వేల మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 144 మంది సీఆర్టీలు, పీజీసీఆర్టీలు బోధన అందిస్తున్నారు. వీరితో పాటు 126 మంది బోధనేతర సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ కూడా విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు.
వంతుల వారీగా పర్యవేక్షణ..
జిల్లాలోని కేజీబీవీల్లో వంతుల వారీగా టీచర్లు పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలలో ఒకరు, కళాశాలలో ఒకరు చొప్పున బోధన సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. పూర్తిస్థాయిలో బోధన జరగకపోవడంతో ఎస్‌ఎస్‌సీ విద్యార్థినులను తరగతి గదుల్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. విద్యార్థినులు హోంవర్క్ చేసుకోవడం.. చదువుకోవడం.. ఆటలాడుతూ కాలం గడుపుతున్నారు. సమ్మె ప్రభావం విద్యార్థినులపై పడకుండా విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సమీప ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి బోధించాలని సూచిస్తున్నా.. ఆచరణ కష్టసాధ్యంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అరకొరగా ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేస్తే.. అక్కడి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. నిత్యం మండలస్థాయి అధికారులు కేజీబీవీలను పర్యవేక్షిస్తున్నారే తప్ప పాఠాలు చెప్పడం లేదు.
ఫలితాలపై ప్రభావం..
పాఠశాల స్థాయిలో సిలబస్ ఇంకా పూర్తి కాలేదు. కళాశాల స్థాయిలో ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చిలో వార్షిక పరీక్షలు ఉన్నాయి. డిసెంబర్‌లోగా సిలబస్ పూర్తయితే పునశ్చరణ తరగతులకు అవకాశం ఉంటుంది. పాఠాలు చెప్పకపోవడంతో విద్యార్థినులపై ఒత్తిడి పెరుగుతోంది. కీలకమైన ఈ సమయంలో చేపట్టిన సమ్మెతో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
స్తంభించిన కార్యకలాపాలు..
విద్యాశాఖలో అనుబంధంగా పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె ప్రభావం విద్యావ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీఓ, సిస్టమ్ ఆనాలిస్టు, డీఎల్‌ఎంటీ, డీటీపీ, ఎంఐఎస్, సీసీఓ, ఐఈఆర్‌పీ, మెసెంజర్స్, పాఠశాల స్థాయిలో ఆర్ట్, క్రాప్ట్, పీఈటీలు, కాంప్లెక్స్ స్థాయిలో సీఆర్‌పీలు ఇలా 141 మంది జిల్లాలో పనిచేస్తున్నారు. వీరందరూ కూడా సమ్మెలో ఉండటంతో రాష్ట్రస్థాయి వరకు ఉత్తర, ప్రత్యుత్తరాలు స్తంభించిపోయాయి. యూడైస్‌లు, మధ్యాహ్న భోజన పథకం బిల్లులు నిలిచిపోయాయి. బియ్యం పంపిణీ, బడిబయట ఉన్న చిన్నారుల గుర్తింపు, రాగి జావా అందించడం తదితర అన్నిరకాల పనులతో ఆగిపోయాయి. ముఖ్యంగా భవిత కేంద్రాల్లో సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రత్యేక అవసరాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమ్మెతో నష్టపోతున్నాం..
టీచర్లు సమ్మెలో ఉండటంతో రోజుకొకరి చొప్పున పాఠాలు చెబుతున్నారు. సమ్మె ప్రభావంతో నష్టపోతున్నాం. ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి టీచర్ల సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయాలి. – కావ్య, పదో తరగతి, ఇటిక్యాల
క్రమబద్ధీకరించే వరకు పోరాటం..
క్రమబద్ధీకరణ కోసం గతేడాది నిరాహార దీక్షలు చేపట్టగా.. రేవంత్‌రెడ్డి న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏ డాది పూర్తయింది. పలుమార్లు రా ష్ట్ర కార్యవర్గం ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసి నా స్పందన లేకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగాం. క్రమబద్ధీకరించే వరకు పోరాటం కొనసాగిస్తాం.
– గోపాల్, సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం కార్యదర్శి
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..
సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మెతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. నిత్యం ఎంఈఓలు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. పిల్లల ఆహారం, ఆరోగ్యం విషయంలో తగు చర్యలు చేపట్టాం. – అబ్దుల్ ఘని, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment