పురాతన బావి సగ భాగాన్ని పూడ్చివేసిన దృశ్యం
ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆక్రమణల పరంపర
ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా కబ్జా
వక్ఫ్ భూములు సైతం వదలని వైనం
నోటీసులతో సరిపెడుతున్న అధికారులు
తాజాగా చింతలపేట వద్ద పురాతన బావిపై కన్ను
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి యత్నం
ప్రజాసంఘాలు, క్రీడాకారులు ఆందోళనతో విషయం వెలుగులోకి..
గద్వాల: ఆయనొక మాజీ మున్సిపల్ చైర్మన్.. 90వ దశకంలో ఆయన ఆడిందే ఆటగా సాగింది. ఇంకేముంది గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడెక్కడ విలువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించాడు.. తెలివిగా ఆ భూములకు సంబంధించి రాజుల వద్ద కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించి దర్జాగా కబ్జా చేసి రూ.కోట్లు కొల్లగొడుతూ వచ్చాడు. ఇదేమని ప్రశ్నిస్తే ఆ స్థలాలు గతంలో రాజుల వద్ద మా తండ్రి కొనుగోలు చేశాడంటూ బుకాయించి కట్టుకథలు వల్లె వేస్తాడు. కబ్జా చేసిన స్థలాలను కాపాడుకునేందుకు అధికారంలో ఎవరు ఉంటే వారి అడుగులకు మడుగులు వత్తడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా గద్వాల పట్టణంలో చింతలపేటలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న రాజుల కాలం నాటి బావిని పూడ్చి దానిపై కమర్షియల్ షాపులు నిర్మించేందుకు సదరు నాయకుడు స్కెచ్ వేశాడు. దీనిపై ప్రజాసంఘాలు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ సదరు నేతపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ఈయన విలువైన భూములను గుర్తించి ఆ స్థలాలను కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. వాటిని తన పేరిట ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడమే కాకుండా ఆయన వారసులకు సైతం కట్టబెట్టాడు.
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఇండోర్ స్టేడియానికి ఆనుకుని ఇటీవల సదరు నేత ఓ ఫంక్షన్ హాలును నిర్మించాడు. ఈ ఫంక్షన్‌హాలు నుంచి వెలువడే ఆహార వ్యర్థ పదార్థాలు ఇండోర్ స్టేడియం వైపే వెళ్లేలా డ్రైనేజీ ఏర్పాటు చేశాడు. దీంతో వ్యర్థాలతో స్టేడియం మొత్తం దుర్వాసనతో నిండిపోయింది. ఆటగాళ్లకు, వాకింగ్ చేసే వారికి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తుంది. అదేవిధంగా దానిపక్కనే ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలాఉండగా, సదరు నాయకుడు తాను ఆక్రమించిన స్థలాలను కాపాడుకునేందుకు ఎవరు అధికారంలో ఉంటే వారికి గొడుగు పడుతూ దర్జాగా కాలం గడుపుతున్నాడు. అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యత్నించే అధికారులపై రాజకీయ పలుకుబడితో ఒత్తిళ్లు తీసుకొచ్చి తప్పించుకుంటున్నాడు.
మచ్చుకు కొన్ని..
● గద్వాల పట్టణం నడిబొడ్డున రథశాల వద్ద ఓ మెడికల్ షాపును గతేడాది ఓ పూల వ్యాపారికి సదరు మాజీ మున్సిపల్ చైర్మన్ రూ.2.50 కోట్లకు విక్రయించాడు. పనిలో పనిగా ఆ షాపు ముందు భాగంలో ఉండే సుమారు రూ.1 కోటి విలువ చేసే మున్సిపల్ స్థలానికి సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దానిని కూడా సదరు పూల వ్యాపారికి విక్రయించాడు. ఇలా కొనుగోలు చేసిన మున్సిపల్ ఖాళీ స్థలంలో షాపు నిర్మాణం చేపట్టాడు సదరు పూల వ్యాపారి. ఈ అక్రమ నిర్మాణంపై ‘సాఽక్షి’ వరుస కథనాలు వెలువర్చింది. దీంతో విచారించిన అధికారులు మున్సిపల్ స్థలంలో చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకొని.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ స్థలాన్ని విక్రయించిన సదరు మాజీ మున్సిపల్ నేతకు నోటీసులు ఇచ్చి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలేమి తీసుకోకుండానే వదిలేశారు.
● రెండవ రైల్వే గేటు సమీపంలో సర్వే నంబర్ 777లో 9.05ఎకరాలు వక్ఫ్‌బోర్డు స్థలంపై సదరు నేత కన్నేశాడు. దీని ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్లపైనే ఉంటుంది. ఈ స్థలంపై కూడా నకిలీ డాక్యుమెంట్లు, ఓఆర్‌సీలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్థలంలో తనపేరిట కాలనీని ఏర్పాటు చేసుకుని ఇళ్ల నిర్మాణం చేసి వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో అప్పట్లో వక్ఫ్‌బోర్డు అధికారి సంతకాన్ని పోర్జరీ చేసినట్లు వక్ఫ్‌బోర్డు అధికారి గద్వాల పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సదరు నేతపై చీటింగ్, పోర్జరీ కింద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే మరో వైపు ఈ స్థలానికి తామే నిజమైన వారసులమని ఖాజీలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం కోర్టులో కేసు కొనసాగుతుంది.
● ఫ్లైఓవర్ బ్రిడ్జికి సమీపంలో ఓ ప్రముఖ ద్విచక్రవాహన షోరూం ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో కూడా వివాదం నెలకొంది. తమ స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో కబ్జా చేశాడని పేర్కొంటూ బాఽధితులు ఉన్నతాధికారులతోపాటు, కోర్టును ఆశ్రయించారు. దీని విలువ సుమారు రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా.
● ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఎదురుగా ఉన్న పురాతన బావిని అప్పటి రాజుల వద్ద కొనుగోలు చేసినట్లు చెబుతూ ఆ బావిని సగభాగం పూడ్చివేసి దాని స్థానంలో కమర్షియల్ షాపులు నిర్మించేందుకు యత్నించాడు. దీని విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
● బావి స్థలాన్ని కాపాడాలి
గద్వాలలోని చింతలపేట వద్ద ఉన్న బావి నలసోమనాద్రి కాలంలో నిర్మించారు. ఏళ్లుగా బావి నీరు పట్టణవాసుల దాహార్తిని తీర్చుతూ వచ్చింది. చుట్టుపక్కల పనిచేసే కూలీలు బావి నీటితోనే దాహార్తి తీర్చుకుంటారు. ఈ బావిని కబ్జా చేసి కమర్షియల్ షాపులు నిర్మించాలని చూస్తున్న నాయకుడిపై చర్యలు తీసుకోవాలి.
– బస్సు మోహన్‌రావు, సీనియర్ సిటీజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు
క్రీడాకారులకు ఇబ్బందులు
క్రీడాకారులకు అందుబాటులో ఉండే ఏకై క ఇండోర్ స్టేడియం ఇదే. ఈ స్టేడియానికి ఆనుకుని నిర్మించిన ఫంక్షన్‌హాలు నుంచి ఆహార వ్యర్థాలు వెలువడడం.. స్టేడియం ఆవరణలో పారుతుండడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ప్రభాకర్ రిటైర్డ్ పీడీ, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు
విచారించి చర్యలు తీసుకుంటాం
మీరు చెబుతున్న పురాతన బావి కబ్జా చేసి పూడ్చిన ఘటన నా దృష్టికి రాలేదు. దీనిపై మున్సిపల్ అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకుంటాను. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
– సంతోష్, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment