బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ
గద్వాల క్రైం: గద్వాల డీఎస్పీగా మొగులయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లా ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించి వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని, రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమ దందాలకు చెక్ పెడతామన్నారు. పాత నేరస్తుల జాబితా ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని, అల్లర్లు, వివాదాలు, మత ఘర్షణలు, వ్యక్తి గత స్వేచ్ఛకు ఇబ్బందులు కలిగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పెండింగ్ కేసుల పురోగతిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి చర్యలు తీసుకుంటామని, అన్ని రాజకీయ, విధ్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, ప్రజల సహకారంతో ముందుకెళ్తామని అన్నారు.
జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్ : జోగుళాంబ శక్తిపీఠాన్ని డీఎస్పీ మొగలయ్య, సీఐ రవి బాబుతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. డీఎస్పీగా బదిలీపై వచ్చిన ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ముందు క్షేత్రాన్ని సందర్శించారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రాలతో సత్కరించారు.
అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
అలంపూర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడమే లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం కర్నూల్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో సీఎం సహాయ నిధి ద్వార మంజూరైన ఎల్‌ఓసీ, చెక్కులను అందజేశారు. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామానికి చెందిన తిమ్మప్ప వైద్య ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకోగా.. సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షల ఎల్‌ఓసీ రావడంతో ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా అయిజ మండలం యాపదిన్నే గ్రామానికి చెందిన బజారికి రూ.57 వేల చెక్కు మంజూరైనట్లు తెలిపారు. వీరితోపాటు నాయకులు వావిలాల రంగారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, మద్దిలేటి, రాజు, మురళికృష్ణ, పాపన్న, శివ తదితరులు ఉన్నారు.
వరుస దొంగతనాలతో బెంబేలు
● మేకలసోంపల్లిలో 15 రోజుల్లో ఐదు ఘటనలు
మల్దకల్: వరుస దొంగతనాలతో మేకలసోంపల్లి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మల్దకల్ మండలంలోని ఈ గ్రామంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అందినకాడికి దోచుకుంటున్నారు. వరుసగా ఐదు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడడంతో ఇళ్లు విడిచి పొలం పనులకు, ఊళ్లకు, సొంత పనులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. గత 15రోజుల నుంచి ఐదు దొంగనాలు జరగడం గమనార్హం. ఈ నెల 4న శనివారం రాత్రి నారంబాయి దుబ్బ కేతన్న ఇంట్లో తాళం పగలగొట్టి రూ.30వేలు దోచుకెళ్లారు. 2వ తేదీన దాసరి ఆంజనేయులు ఇంట్లో నాలుగు తులాల బంగారం చోరీ చేశారు. అదే రోజు సందుల రామన్న ఇంట్లో పట్టపగలు చొరబడి రూ.12వేలు ఎత్తుకెళ్లారు. గత 15 రోజుల క్రితం దాసన్న ఇంట్లో రూ.40వేలు, డబ్బా రామన్న ఇంట్లో రూ.30వేలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నందికర్ తెలిపారు. ఇదిలాఉండగా గ్రామంలో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. మరోవైపు వరుస ఘటనలతో ఎప్పుడు ఎవరి ఇంట్లో దొంగతనం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పోలీసులు రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయడంతో పాటు దొంగతనాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మైసమ్మ జాతరకు
తగ్గిన భక్తుల రద్దీ
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు తక్కువ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శంచుకొని మొక్కులు తీర్చుకున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు యాసంగి వరినాట్లలో నిమగ్నం కావడంతో కేవలం 4 వేల మంది మాత్రమే అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల సంఖ్య కూడా తగ్గించింది. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, వనపర్తి డిపో నుంచి 4 బస్సుల మాత్రమే నడిపారు.
Comments
Please login to add a commentAdd a comment