మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు
‘ఇందిరా మహిళాశక్తి’లో ఉపాధి అవకాశాలు
అచ్చంపేట: మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా 17 రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ప్రభుత్వ స్థలాల్లో మహిళాసంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ప్లాంట్లను కేటాయించనుండగా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 350 యూనిట్ల వరకు వచ్చే అవకాశం ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి స్థాపనకు ప్రభుత్వమే భూమిని సమకూర్చి రుణ సదుపాయం కల్పించనుంది. స్వయం సహాయక సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుంటే జిల్లావ్యాప్తంగా సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆశించిన మేరకు ప్రభుత్వ భూములు జిల్లాలో ఉన్నాయి. మహిళా సంఘాలకు భూములను తక్కువ లీజుకు కేటాయించే అవకాశముంది. ఒక్క మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు4 ఎకరాల స్థలం అవసరం. ఒక్కో ప్లాంట్ రూ.3 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో 10 శాతం మహిళా సంఘాలు చెల్లిస్తే 90 శాతం బ్యాంక్ రుణం ఇప్పించనున్నారు.
స్థలాల ఎంపిక కోసం ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి డీఆర్‌డీఓ కార్యాలయాల నుంచి తహసీల్దార్లకు ప్రభుత్వ స్థలాల ఎంపిక కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే నాగర్‌కర్నూలు జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లకు ఐదు మండలాల్లో స్థలాల ఎంపిక పూర్తి చేశారు. 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే స్థలాలను ఎంపిక చేయాలని నిబంధన పెట్టారు. ఆయా మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణపై త్వరలో శిక్షణ ఇప్పించనున్నారు.
ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం
పొదుపు సంఘాల మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా శక్తి పేరుతో మహిళల వ్యాపారాల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టింది. ఈమేరకు ఇప్పటికే ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు అన్ని జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించిగా వాటిపై ఆసక్తి ఉన్న మహిళల వివరాలు సేకరించి అందులో ప్రోత్సాహం కల్పిస్తోంది.
శిక్షణ ఇప్పిస్తాం
నాగర్‌కర్నూలు జిల్లాలో రెవెన్యూ అధికారుల సహకారంతో 5గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల ఎంపిక చేశాం. ఆయా గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పిస్తాం. మరికొన్ని చోట్ల స్థలాలు లభిస్తే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రణాళికలు పంపనున్నాం.
– ఓబులేష్ డీఆర్‌డీఓ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 350 యూనిట్లు
10 శాతం సభ్యుల వాటా,
మిగతాది బ్యాంక్ రుణం
ఒక్కో యూనిట్ రూ.3.13
సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్‌కు రూ.3.13 చొప్పున ధర డిస్కమ్‌ల(విద్యుత్ ఉత్పత్తి సంస్థల)తో ప్రభుత్వమే కొనుగోలు చేయిస్తుంది. దీంతో మహిళా సంఘాలకు ఏడాదికి సుమారుగా రూ.30లక్షల ఆదాయం వస్తుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment