అంతా గుట్టుగా..! | - | Sakshi
Sakshi News home page

అంతా గుట్టుగా..!

Published Sat, Jan 4 2025 8:37 AM | Last Updated on Sat, Jan 4 2025 8:37 AM

అంతా గుట్టుగా..!

అంతా గుట్టుగా..!

ఎలాంటి ప్రకటన లేకుండా టెక్నికల్‌ పోస్టుల భర్తీకి కసరత్తు ?

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో మొత్తం 32 పోస్టులు ఖాళీ

తాజాగా 16 పోస్టులకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

అర్హత లేని వారు రావడంతో విషయం వెలుగులోకి..

గద్వాల క్రైం: జిల్లా కేంద్రం సమీపంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో టెక్నికల్‌ పోస్టులను ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా గుట్టుగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెండు నెలల క్రితం దౌదర్‌పల్లి సమీపంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రారంభించారు. ఈమేరకు అధ్యాపకులు, ప్రొఫెసర్ల నియామకం పూర్తి కాగా.. బోధనా తరగతులు సైతం ఈ అకాడమిక్‌ ఇయర్‌లో కొనసాగుతున్నాయి. అయితే మెడికల్‌ కళాశాలలోని వివిధ విభాగాలలో 32 టెక్నికల్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక, మెడికల్‌ కళాశాల ఏఓ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 16 టెక్నికల్‌ పోస్టుల ఎంపికకు కొందరు అభ్యర్థుల అర్హత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. వాస్తవంగా కళాశాలలోని ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ లేదా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అప్పుడు నిరుద్యోగ యువత ఆయా విభాగాల్లోని టెక్నికల్‌ పోస్టులకు దరఖాస్తు చేస్తారు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అర్హులను అధికారులు ఎంపిక చేస్తారు.. ఇదీ సాధారణంగా ఏ శాఖలో అయినా జరిగే నియామక తంతు. కానీ, జిల్లాలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోని టెక్నికల్‌ పోస్టులను ఎలాంటి అధికార ప్రకటనలు లేకుండానే 16 పోస్టుల భర్తీకి అధికారులు 16 మంది వ్యక్తుల అర్హత ధృవపత్రాల పరిశీలన చేయడం గమనార్హం. దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంపికకు అర్హత లేని ఓ మైనర్‌, ఇద్దరు వ్యక్తులు అక్కడకు రావడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

16 మంది ధ్రువపత్రాల పరిశీలన

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం టీవీవీ(తెలంగాణ వైద్యా విధాన్‌ పరిషత్‌) కింద కొందరు టెక్నికల్‌ విభాగంలో పని చేస్తున్నారు. అయితే సీనియార్టీ ఉన్న వారిని మెడికల్‌ కళాశాలకు ఎంపిక చేయాలని, ప్రస్తుతం వారికి జీతాలు వైద్యా విధాన్‌ పరిషత్‌ నుంచి రావడం లేదని, టెక్నికల్‌ పోస్టులకు అవకాశం కల్పించాల్సిందిగా కొందరు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. వారు ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే 16 మంది అర్హత కలిగిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారని సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా ఎలాంటి పని అనుభవం లేని ముగ్గురు వ్యక్తులు ధ్రువపత్రాల పరిశీలనకు రావడం ఏంటనే ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు. ఎక్కడైనా పోస్టుల భర్తీకి ముందుగా అధికార ప్రకటన చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా గుట్టుగా నియామక ప్రక్రియ చేపట్టడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్ని అర్హతలు ఉన్న ఎందరో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చాలీచాలని జీతాలకు పని చేస్తున్నారని, అలాంటి వారెందరికో ఇలా గుట్టుగా నియామక ప్రక్రియ చేపట్టడంతో అన్యాయం జరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై న సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మెడికల్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న టెక్నికల్‌ పోస్టులకు బహిరంగ ప్రకటన విడుదల చేసి.. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకే..

మెడికల్‌ కళాశాలలో రేడియో, ఈసీజీ, ఎక్స్‌రే, ల్యాబ్‌ తదితర టెక్నికల్‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాల్లో అనుభవం కలిగిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా అధికారులు సిఫార్సు చేసిన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చారు. అయితే ధ్రువపత్రాల పరిశీలనలో ముగ్గురు వ్యక్తులు ఇక్కడ పని చేయని వారు అని గుర్తించాం. ఇదేమి రహస్యంగా చేయడంలేదు. పరిశీలన నివేదిక కలెక్టర్‌కుఅందజేస్తాం. – ప్రియాంక,

జిల్లా ఉపాధి కల్పన అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement