డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం
గద్వాలటౌన్ : జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణం క్రమబద్ధీకరించాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు రోజుకో రీతిలో వినూత్నంగా సాగుతున్నాయి. శుక్రవారం 25వ రోజు దీక్ష చేపట్టిన కేజీబీవీ సీఆర్‌టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్‌ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వమత ప్రార్థనలతో నిరసన వ్యక్తం చేశారు. సమ్మె శిబిరంలోనే ఉద్యోగులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. అంతకుముందు జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరితతో పాటు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకుంటారని చెప్పారు. మీ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దలు మీ డిమాండ్లపై చర్చించారని తెలిపారు. ప్రభుత్వానికి రెండు మూడు నెలల గడువు ఇవ్వాలన్నారు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణమే సమ్మెను విరమించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు, కేజీబీవీ ఎస్‌ఓలు, సీఆర్‌టీలు, పీఈటీలు, ఏఎన్‌ఎంలు, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
పీజీ సెంటర్‌లో నిరసన..
యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కాంట్రాక్టు అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసులు, మహేందర్, గోపినాథ్ రాథోడ్, గణేష్, అరవింద్, మహమ్మద్ రఫీ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment