అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ
కాకినాడ సిటీ: పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీ ప్రక్రియకు సంబంధించి జిల్లా స్థాయి శిక్షణ మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు తదితరులు హాజరయ్యారు. ఈ శిక్షణ పొందిన అధికారులు ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మండలాల్లోని అధికారులకు, లైన్ డిపార్టుమెంట్ ఉద్యోగులకు శిక్షణ ఇస్తారని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా సరైన అవగాహన లభిస్తేనే వచ్చే ఏడాదికి ప్రణాళిక సక్రమంగా తయారు చేసి అమలు చేయనున్నారు. లేకుంటే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావల్సిన నిధుల విషయంలో వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. ఈ శిక్షణ ప్రణాళిక తయారీ, అమలు, ఆడిట్‌ల ప్రాధాన్యం పరంగా ఇవ్వటం జరుగుతుందని ప్రిన్సిపల్ లక్ష్మణరావు వివరించారు. శిక్షణ పర్యవేక్షణకుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థకు చెందిన అధికారులు, ప్రిన్సిపాల్, సామర్లకోట విస్తరణ కేంద్రం పరిశీలకుడు హాజరై పర్యవేక్షిస్తారన్నారు. ఈ శిక్షణలు ముఖ్యంగా గ్రామ, మండల, జిల్లా పరిషత్ స్థాయిలోని పంచాయతీలు 2025–26 సంవత్సరానికి తయారు చేయాల్సిన ప్రణాళికలను సమర్థవంతంగా తయారు చేసి, పంచాయతీల అభివృద్ధికి కావలసిన నిధుల విడుదలలో సమస్యలు రాకుండా చూసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment