‘మహిళా రక్షక్’ సేవలు ప్రారంభం
కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ శాఖ పరిధిలో మహిళా రక్షక్ వాహనాల సేవలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. మహిళా కానిస్టేబుల్ లేదా హోం గార్డులు ఈ వాహనాలపై సంచరిస్తూ మహిళల భద్రతను పర్యవేక్షిస్తారన్నారు. మహిళలు లేదా విద్యార్థునులు వేధింపులకు గురవుతున్న ప్రాంతాల్లో మహిళా రక్షక్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎవరైనా ఈ మహిళా రక్షక్ రక్షణ కోరితే తక్షణమే మహిళా పోలీస్ అక్కడికి చేరుకుంటారని తెలిపారు. ఈ వాహన సేవలు పొందేందుకు 112, 100 నంబర్లకు డయల్ చేయాలని, అలాగే కాకినాడ ఎస్పీ వాట్సప్ హెల్ప్ లైన్ 94949 33233 నంబర్లను సంప్రదించాలన్నారు.
పాత పెన్షన్ విధానం
కోసం పోరాటం
సామర్లకోట: రైల్వే ఉద్యోగులు, కార్మికులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పోరాటం చేస్తోందని సంఘ విజయవాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి, ఏఐఆర్‌ఎఫ్ కోశాధికారి సీహెచ్ శంకరరావు అన్నారు. రైల్వే సంఘ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక సంఘ కార్యాలయం వద్ద జరిగిన సభలో మాట్లాడారు. భారతీయ రైల్వేలో యూనియన్ల గుర్తింపు కోసం డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని రైల్వే బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. ఈ మేరకు డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జరిగే ఎన్నికల్లో తమ సంఘానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ డివిజనల్ కార్యదర్శి ఎం.లీల, అధ్యక్షుడు రామ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
అమలాపురం రూరల్: బాలల సంరక్షణ కేంద్రాలను నడుపుతున్న సంస్థలు, వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా పర్యవేక్షణాధికారి ఎల్.ఆదిసాయి లక్ష్మీమణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జువైనెల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం 2015లోని సెక్షన్ 41 కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించారు. నిర్దేశించబడిన ఫార్మాట్‌లో నింపిన దరఖాస్తుతో పాటు, అన్ని కాపీలు జత చేసి ఈ నెల 11వ తేదీలోపు సంచాలకులు, బాలల సంక్షేమం, సంస్కరణలు, సేవలు వీధిబాలల సంక్షేమశాఖ, విజయవాడ అనే చిరునామాకు పంపాలన్నారు. htt p://wdcwap.gov.in అనే వెబ్ సైట్‌లో వివరాలు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment