భక్తులకు తీరనున్న హాట్ పాట్లు
అన్నవరం: రత్నగిరి భక్తులకు పశ్చిమ రాజగోపురం ఎదురుగా విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ ప్రతిపాదనల మేరకు రూ.88 లక్షలతో వంద అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పున అధునాతన టెక్నాలజీతో ‘టెన్‌సిల్’ షెడ్డు నిర్మాణానికి దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న 60 గదుల వీఐపీ సత్రాన్ని గత ఏడాది కూల్చివేసి విశ్రాంతి షెడ్డు నిర్మించాలనుకున్నప్పటికీ కారణాంతరాలతో సాధ్యం కాలేదు.
‘సాక్షి’ కథనంతో ప్రతిపాదనలు
ఈ ఏడాది జనవరి 20వ తేదీన సాక్షి దినపత్రికలో ‘రత్నగిరిపై హాట్ పాట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో ఈఓ రామచంద్రమోహన్ స్పందించి అధునాతన సాంకేతికతతో ‘టెన్‌సిల్’ షెడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ వెంటనే మార్చి నెలలో ఎన్నికల కోడ్, అనంతరం ప్రభుత్వం మార్పు తదితర కారణాలతో ఆ నిర్మాణానికి అనుమతలు రావడం ఆలస్యమైంది. తాజాగా ఈ టెన్‌సిల్ నిర్మాణానికి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి మంజూరు చేశారని ఈఓ తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పశ్చిమ రాజగోపురానికి అడ్డుగా కాకుండా ఒక పక్కగా నిర్మిస్తామని ఆయన వివరించారు.
13న సత్యదేవుని తెప్పోత్సవం
క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా పంపా నదిలో సత్యదేవుని తెప్పోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవంలో ఉపయోగించే పంటుకు మంగళవారం పూజలు చేసి నదిలోకి దింపారు. ప్రస్తుతం పంపా నదిలో నీటి మట్టం 99 అడుగులకు ఉందని, ఉత్సవం నిర్వహణకు 94 అడుగుల నీటిమట్టం సరిపోతుందని అధికారులు తెలిపారు. దేవస్థానం ఏసీ రామ్మొహన్‌రావు, ఈఈ రామకృష్ణ, డీఈలు రాంబాబు, గుర్రాజు, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ ఈ పనులను పర్యవేక్షించారు. ఇరిగేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పశ్చిమ రాజగోపురం వద్ద
విశ్రాంతి షెడ్ నిర్మాణానికి అనుమతి
రూ.88 లక్షలతో ‘టెన్‌సిల్’ షెడ్డు
Comments
Please login to add a commentAdd a comment