వేట నిషేధ సాయం ఏమైంది!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రోజూ సాగరంలో సమరం.. వేటే వారి జీవనాధారం.. వలకు చిక్కిన చేపలే ఆ మత్స్యకారుల జీవన గమనానికి ఆధారం.. అలాంటి సముద్ర వేటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఏప్రిల్ 14 నుంచి రెండు నెలల పాటు నిషేధిస్తుంటాయి. ఆ నిషేధ సమయం 61 రోజులూ సాపాటు లేక మత్స్యకార కుటుంబాలు నానా అవస్థలు పడుతుంటాయి. ఈ ఏడాది నిషేధ సమయం ముగిసి ఆరో నెల వచ్చేసింది. ఆ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక అవే ఇప్పుడు గుదిబండగా మారాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ రోజు తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కాదని, సముద్ర వేటపై ఆధారపడిన మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 35 వేల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసాకు కూటమి సర్కార్ మోకాలడ్డు పెట్టింది. అదే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఏటా వేట నిషేధ సమయం ముగియకుండానే పరిహారాన్ని అందజేసి మత్స్యకారులకు భరోసా కల్పించారు. గత ఐదేళ్లూ ఏటా మే లేదా జూన్ నెల దాటకుండానే వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేస్తూ వచ్చారు. మెకనైజ్డ్, మోటారు బోట్లపై సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి 61 రోజుల వేట నిషేధ సమయంలో వేట నిషేధ భృతిగా రూ.10 వేల చొప్పున వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసింది. అటువంటిది కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక సమస్యలు మొదలయ్యాయని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలైనా ఏ ఒక్క మత్స్యకారుడి ఖాతాల్లో వేట నిషేధ భృతి జమ కాలేదని వాపోతున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ పరిహారం కుటుంబానికి కేవలం రూ.4 వేల చొప్పున అందజేసింది. ఇలా 2019 వరకూ 22,250 మందికి రూ 8.90 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చారు.
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
కాకినాడ జిల్లాలో సుమారు 94 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తొండంగి, తుని రూరల్, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, తాళ్లరేవు మండలాల పరిధిలో 1,95,184 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. ఇందులో సముద్రంలో చేపల వేటపై ఆధారపడి 36,101 మంది ఉపాధి పొందుతున్నారు. క్రమం తప్పకుండా గడచిన ఐదేళ్లు ఏటా మత్స్యకార భరోసాగా రూ.24 కోట్ల నుంచి రూ.30 కోట్ల నిషేధ భృతిగా 25 వేల నుంచి 30 వేల మంది మత్స్యకార కుటుంబాలకు నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి వారి వ్యక్తిగత ఖాతాలకు జమచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేట నిషేధ భృతికి అర్హులను మత్స్యశాఖ గుర్తించి నెలలు గడుస్తోంది.
గత మే నెలలోనే కాకినాడ జిల్లాలో 24,147 మత్స్యకార కుటుంబాలను భృతికి అర్హమైనవిగా ఎంపిక చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో ఈ ఏడాది వేట నిషేధ భృతి కోసం 11,305 మందిని గుర్తించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందించాలి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సుమారు 48 వేల కుటుంబాలకు వేట నిషేధ భృతి ఇవ్వాలి. ఇంకా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
కాకినాడ జిల్లాలో..
తీర ప్రాంత మండలాలు : 5
మత్స్యకార గ్రామాలు: : 58
మైరెన్ ఫిషర్‌మెన్ : 2లక్షల మంది
సముద్ర వేట ద్వారా
జీవనోపాధి : 36,101 మంది
మెకనైజ్డ్ బోట్లు : 467
మోటారు బోట్లు : 3779
సంప్రదాయ బోట్లు : 399
ఎప్పుడిస్తారో తెలియక
మత్స్యకారుల ఎదురుతెన్నులు
నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment