జియ్యన్న మఠంపై ప్రభుత్వానికి నివేదిక
గండేపల్లి: మండలంలోని తాళ్లూరు జియ్యన్న మఠంగా పిలిచే వెంకటేశ్వరస్వామి ఆలయంలో పలు సమస్యలపై నిర్వహించిన బహిరంగ విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తామని జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీవీఎల్ రమేష్‌బాబు తెలిపారు. రాష్ట్ర ఆర్కియాలజీ కమిషనర్ డాక్టర్ జి.వాణీమోహన్ ఆదేశాలతో అధికారుల కమిటీ తాళ్లురులోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం బహిరంగ విచారణ చేపట్టింది. అనంతరం రమేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ తాళ్లురు మఠానికి సంబంధించి, గతంలో ఆర్కియాలజీ విభాగానికి చెందిన అధికారి ఇచ్చిన ఆర్డర్‌పై నెలకొన్న వివాదంపై విచారణ జరిపామని, అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తుల నుంచి సమాచారం సేకరించామని తెలిపారు. ఒక అర్చకుడి నుంచి కొన్ని దస్త్రాలు తమకు అందాల్సి ఉందని, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన వివరించారు. కమిటీలో పాల్గొన్న ఆర్కియాలజీ విభాగం డీడీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ తమ శాఖకు చెందిన అధికారి 2010లో ఒక వంశానికి చెందిన కుటుంబానికి మఠం నిర్వహణ అధికారాన్ని కట్టబెడుతూ ఆర్డర్ ఇచ్చారని దీనిపై మరో వంశం వారు అభ్యంతరం చెప్పారని, సదరు ఆర్డర్ ఇచ్చే అర్హత తమ విభాగానికి లేదని తెలిపారు. ఈ విచారణలో దీనిని మఠంగా నిర్వహిస్తున్నారా, వెంకటేశ్వర దేవస్థానంగా దేవదాయశాఖ పరిధిలో వుందా, ఆస్తుల అన్యాక్రాంతం తదితర అంశాలపై విచారణ సాగిందన్నారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయగా, పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దేవదాయశాఖ డీసీ రమేష్‌బాబు
పురావస్తుశాఖ ఆర్డర్‌పై విచారణ
Comments
Please login to add a commentAdd a comment