లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్‌పై అట్రాసిటీ కేసు
కాకినాడ రూరల్: స్థానిక ఇంద్రపాలెంలోని లక్ష్మీ గాయత్రి నర్సింగ్ స్కూల్‌పై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. సుమారు 300 మంది విద్యార్థులు ఉన్న ఈ సంస్థలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గీయులే ఉన్నారు. ఈ స్కూల్‌లో అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక వసతుల లేమి, భోజనంలో నాణ్యత లేదని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఆయన ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ నాయక్, ఐసీడీఎస్ పీడీ ప్రవీణ, ఆర్డీఓ మల్లిబాబు తదితరులు అక్కడి విద్యార్థులను విచారించి వివరాలు సేకరించారు. ఆ నివేదికను వారు కలెక్టర్ షణ్మోహన్‌కు అందజేశారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందించి అన్ని నర్సింగ్ పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కాగా లక్ష్మీ గాయత్రీ నర్సింగ్ స్కూల్ యాజమాన్యంపై అట్రాసిటీ కేసు నమోదుకు ఆదేశించినట్టు ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు.
కాలపరిమితి
జీఓ రద్దు చేయాలి
కాకినాడ సిటీ: మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న యానిమేటర్లను తొలగించాలని ఇచ్చిన కాల పరిమితి సర్క్యులర్‌ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగులు బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యానిమేటర్లపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని విమర్శించారు. అక్రమ తొలగింపులు చెల్లవని, తొలగించిన తిరిగి నియమించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం జిల్లా డీఆర్‌డీఏ అధికారులు అమలు చేయకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళనకారులు వివరించారు. వీవోఏల చేత విలేజ్ మాల్ సరుకులు విక్రయించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సంఘం గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాభవాని, ఈశ్వరీబాయి, మేరీ, చంద్రవతి, నర్ల ఈశ్వరి, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు కలెక్టర్ షణ్మోహన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ముడిపులు ఇచ్చిన వారికే
నష్ట పరిహారం
కిర్లంపూడి: గతంలో వచ్చిన తుపానులకు పంటలు నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పంట నష్టపరిహారం అందలేదని, ముడుపులిచ్చిన వారికే అధికారులు పరిహారం ఇచ్చారని భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు ఆరోపించారు. స్థానిక విజ్ఞాన భారతి హైస్కూల్‌లో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు రాసంశెట్టి రాజా అధ్యక్షతన బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యల్లపు సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు నీలగిరి చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు రైతును నిండా ముంచాయన్నారు. పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే అధికారులు మాత్రం అసలైన రైతులను విడిచిపెట్టి ముడుపులు చెల్లించిన వారికి మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి అర్హులైన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. కోతలు కోయకుండానే విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ జె.చిరంజీవికి వినతిపత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment