రూ.25 వేలు దోచేసిన సైబర్ నేరగాళ్లు
కరప: సైబర్ నేరగాళ్లు మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా కరపకు చెందిన ఒక చిరుద్యోగి రూ.25 వేలు పోగొట్టుకున్నాడు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కరప గ్రామానికి చెందిన పెనుపోతులు రాజ్‌కుమార్ గురజనాపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అతను కంపెనీలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ ఆధార్‌కార్డుపై సిమ్‌కార్డు తీసుకుని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్నారని బెదిరించాడు. తర్వాత మరో వ్యక్తి రాజ్‌కుమార్ ఫోన్‌కు వాట్సాప్ వీడియో కాల్ చేసి ముంబయి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు పరిచయం చేసుకున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి పోలీసు యూనిఫాం ధరించి ఉన్నాడు. అతని వెనుక సెటప్ అంతా పోలీస్ స్టేషన్‌లా కనబడటంతో రాజ్‌కుమార్‌కు కంగారు పట్టుకుంది. తన పేరు, ఆధార్‌కార్డు నంబరు కరెక్ట్‌గా చెప్పడంతో సదరు మోసగాడు అడిగే ప్రశ్నలకు సరెండర్ అయిపోయాడు. నిన్ను డిజిటల్ అరెస్ట్ చేశాం, ఎవరూ లేని గదిలోకి వెళ్లమన్నాడు. రాజ్‌కుమార్ వద్ద మరో మొబైల్ ఫోన్ ఉందని గ్రహించి, దానిని స్విచ్ఛాప్ చేయమని ఆదేశించాడు. ఎనీ డస్క్ యాప్ ద్వారా రాజ్‌కుమార్ సెల్‌ఫోన్ సైబర్ కేటుగాడు స్వయంగా ఆపరేట్ చేస్తూ, ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశాడు. మనీ ల్యాండరింగ్ చేశావని, రూ.2.59 కోట్ల మేర లావాదేవీలు జరిపావని బెదిరించాడు. దీనిపై కేసు నమోదు చేసి, డిజిటల్ అరెస్ట్ చేశామని తెలిపి, ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు మరికొన్ని పత్రాలు వాట్సాప్ చేశాడు. కోర్టు ఫీజు చెల్లించాలంటూ వెంటనే రూ.25 వేలు పంపించాలని ఆదేశించారు. మోసగాడి మాటలకు భయపడిన రాజ్‌కుమార్ అతను చెప్పిన విధంగానే సదరు సొమ్మును యూపీఐ పేమెంట్ చేశాడు. కొంత సమయం తర్వాత మరో రూ.25 వేలు పంపాలని కేటుగాడు డిమాండ్ చేశాడు. తన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదని, కరప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోతానని బాధితుడు తెలిపాడు. అంతవరకు లైన్‌లోనే ఉంటానని, స్టేషన్ కెళ్లి పోలీసులకు ఫోన్ ఇమ్మని చెప్పాడు. మోటార్ సైకిల్‌పై ఫోన్ మాట్లాడుతూ నడకుదురు వద్దకు వచ్చేసరికి సైబర్ మోసగాడు ఫోన్ కట్‌చేసి, రాజ్‌కుమార్‌కు పంపించిన పత్రాలు డిలీట్ చేశాడు. మోసపోయానని గ్రహించిన రాజ్‌కుమార్ కరప స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ టి.సునీతకు జరిగిన ఉదంతమంతా వివరించాడు. 1930కి కాల్‌చేసి సైబర్ కేసు నమోదు చేయించుకోవాలని బాధితుడికి పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment