సంక్షేమం డొల్ల!
● పెద్దాపురం రూరల్, అర్బన్ పరిధిలో ఉన్న ఎనిమిది వసతిగృహాల్లో సుమారు 950 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీటిలో పెద్దాపురం ఎస్సీ బాలుర వసతి గృహాలు రెండూ పూర్తిగా శిథిలావస్థలో కనిపించాయి. కనీసం ఈ వసతిగృహానికి రక్షణ గోడలు కూడా లేవు సరికదా కనీస వసతులు కొరవడ్డాయి. సామర్లకోట బీసీ బాలికల వసతిగృహం చుట్టూ దుర్గంధం వ్యాపించి ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సమీపంలోని రాజీవ్ గృహకల్ప ఇళ్ల సముదాయాల నుంచి నిత్యం మురుగునీరు నిలిచిపోయి అక్కడున్న గోతుల్లో పందులు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హాస్టల్ సమీపంలో సెప్టీక్లీన్ ట్యాంకర్లను నిలిపి ఉంచడంతో దోమల బెదడతో సతమతమవుతున్నారు. చీకటి పడిందంటే చాలు దోమలతో వేగలేకపోతున్నారు. కనీసం దోమల చక్రాలు కూడా ఇవ్వడం లేదు. ఇక్కడి నుంచి సెప్టీక్లీన్ ట్యాంకర్లను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులలో స్పందన లేదు. హాస్టల్ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. శ్లాబ్‌లు పెచ్చులూడి పడిపోతున్నాయి. తలుపులు చెదపట్టేశాయి. ఆవరణలో చెత్త పెరిగిపోయినా ఇన్‌చార్జి వార్డెన్ కావడంతో పెద్దగా దృష్టిపెట్టడం లేదు. గతంలో 30 మంది ఉండే విద్యార్థినులు ఇక్కడి పరిస్థితులతో 15 మందికి తగ్గిపోయారు.
ప్రహరీ లేని వసతి గృహం
శిథిలావస్థకు చేరిన పెద్దాపురం ఎస్సీ బాలుర వసతి గృహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్షేమ హాస్టళ్లలో భద్రత వట్టిమాటగానే మిగిలిపోతోంది. కరెంటు పోతే కటిక చీకటి.. ఇన్వెర్టర్లు లేని దుస్థితి.. ప్రహారీ గోడలు లేక భద్రత లేని డొల్లతనం.. అంత మంది విద్యార్థినులున్న వసతి గృహాల్లో రక్షణ కరువు.. పారిశుధ్యం క్షీణించడం.. పందుల స్వైర విహారం.. దోమలతో విద్యార్థినుల సహవాసం. కనీసం దోమల చక్రాలకు దిక్కులేని పరిస్థితి.. రెసిడెన్షియల్, వసతిగృహాల్లో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండాలంటే మార్గదర్శకాలు అవసరమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకుని సూచించిందటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలనలో అనేక లోపాలు బయటపడ్డాయి.
జిల్లాకు ఒక వైపున ఉన్న తుని నియోజకవర్గ కేంద్రంలోని హంసవరం మోడల్ స్కూల్, కోటనందూరు మండలం తిమ్మరాజుపేట, తొండంగి మండలం రావికంపాడు వసతిగృహాల్లో అధ్వాన పరిస్థితులు కనిపించాయి. హంసవరం మోడల్ స్కూల్‌లో 9 నుంచి ఇంటర్ వరకు 100 మంది పైనే చదువుతున్నారు. ఇంత మంది ఉన్న ఈ వసతి గృహానికి ప్రహరీ గోడ లేదు. దీంతో చీకటి పడిందంటే చాలు విద్యార్థులు భయంతో ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తున్న వాతావరణం. రాత్రిపూట విద్యార్థులకు కనీస రక్షణ కరువైంది. ప్రైవేటు సంస్థల నుంచి కనీస భద్రత కూడా ఏర్పాటు చేయక పోవడంతో విద్యార్థినులు బెంగపెట్టుకుంటున్నారు.
● కోటనందూరు మండలం తిమ్మరాజుపేటలోని బీసీ బాలికల వసతి గృహంలో 42 మంది విద్యార్థినులున్నారు. ఈ హాస్టల్ భవనం శిథిలమై శ్లాబ్ పెచ్చులు ఊడి విద్యార్థినిలపై పడుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ హాస్టల్‌లో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉండడం విద్యార్థినులకు శాపంగా మారింది. కనీసం తాగునీరు సక్రమంగా ఉండటం లేదు. హాస్టల్‌లో నెలకొన్న పరిస్థితులతో గత్యంతరం లేక సిబ్బంది స్థానిక విద్యార్థినులను హాస్టల్లో చేర్చుకుని భోజనానంతరం ఇళ్లకు పంపేస్తున్నారు.
● తొండంగి మండలం రావికంపాడు బీసీ హాస్టల్ భవనం దాదాపు శిథిలావస్థలో ఉంది. మరుగుదొడ్ల నిర్వహణ చాలా దారుణంగా ఉండి అడుగుపెట్టే వాతావరణం లేదు.
● ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాల ప్రాంగణం అధ్వానంగా తయారైంది. పాఠశాల ప్రాంగణం మొత్తం తుప్పలమయమై విద్యార్థినులు భయకంపితులవుతున్నారు. ఇటీవలే ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శంఖవరం కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేస్తున్న వంటశాల చాలా అపరిశుభ్రంగా కనిపించింది. విద్యార్థులు తరచు అనారోగ్యాలు పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● పిఠాపురం బైపాస్ రోడ్‌లో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు భద్రత కరువైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో బాలికల వసతిగృహంలోనే మరుగుదొడ్లకు తలుపులు లేక విద్యార్థినులు నరకం కళ్లచూస్తున్నారు. గదులు తలుపులు, కిటికీలకు దోమల మెష్‌లు లేక చీకటి పడితే నానా అవస్థలు పడుతున్నారు. బట్టలు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. రాత్రిపూట విద్యుత్ పోయిందంటే హాస్టల్‌లో అంధకారం తాండవిస్తోంది. వాచ్‌మెన్, కనీసం ప్రైవేటు భద్రత కూడా లేదు.
● జగ్గంపేట మండలం రామవరం ఎస్సీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థినులు భయకంపితులను చేస్తోంది. వసతి గృహంలో 72 మంది భయంభయంగా కాలం గడుపుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే ప్రాణాలు అరచేత పట్టుకుని ఉంటున్నారు. ఇన్వెర్టర్ సదుపాయం లేక చార్జింగ్ లైట్లతో కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి. వసతి గృహంలోని ఫ్యాన్లు సైతం సరిగా పనిచేయకపోవడంతో దోమలు, ఉక్కపోతతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.
● కాకినాడ జగన్నాథపురంలోని వసతిగృహం శిథిలావస్థకు చేరడంతో ప్రైవేటు భవనంలో వసతి కల్పించారు. చర్చి స్క్వేర్ సమీపంలో ఓఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన భవనంలో 170 మంది ఎస్సీ విద్యార్థులు ఉంటున్నారు. వెంకట్‌నగర్‌లో ఉన్న రెండు ఎస్సీ హాస్టళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇక్కడి విద్యార్థులను గాంధీనగర్‌లో ప్రైవేటు వసతి భవనంలోకి మార్చారు. ఆ భవనంలోనూ భద్రత కరువే. హాస్టల్ పర్యవేక్షణకు వార్డెన్ తప్ప ప్రైవేటు సెక్యూరిటీ కూడా లేదు. కనీసం సీసీ కెమేరాలు లేవు సరికదా ఉన్న ఇన్వెర్టర్లు సక్రమంగా పనిచేయడంలేదు. వసతి గృహాల్లో పరిస్థితులు చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
వసతిగృహాల్లో భద్రత కరవు
ప్రహారీలు లేక భయంభయం
పారిశుధ్యం క్షీణించి
దోమలతో సహవాసం
హైకోర్టు చెప్పింది అక్షర సత్యం
సవతి ప్రేమ చూపుతున్న పాలకులు
Comments
Please login to add a commentAdd a comment