బాల్యం ఎంతో మధురం
బాలలపై అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో నమోదు : కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ/బోట్‌క్లబ్: బాలల పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల పోక్సో చట్టం కింద కఠినమైన చర్యలు చేపడతామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ స్టేడియంలో ఐసీడీఎస్, విద్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, డీఎస్పీ రఘువీర్ విష్ణు గౌరవ అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. బాల్యాన్ని మధురమైన దశగా నిలిపేందుకు బాలలకు ప్రత్యేక హక్కులు కల్పించి, వారి రక్షణకు పోక్సో వంటి చట్టాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. బాలలపై అకృత్యాలను అరికట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. చైల్డ్ సేఫ్ జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దే లక్ష్యంగా జిల్లాలో 6 నెలల పాటు ఉద్యమ కార్యాచరణ చేపట్టి, చైల్డ్ అబ్యూజ్ నివారణకు గుడ్–బ్యాడ్ టచ్, పిల్లల హక్కులు, రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 1098, 112 హెల్ఫ్‌లైన్లకు ఫోన్ చేయవచ్చునని, 73311 26044 నెంబరుకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసి తక్షణ సాయం పొందవచ్చని ఆయన బాలలకు సూచించి ఆయా నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆయన ప్రశంసా పురస్కారాలను అందజేశారు. పీఎం కేర్స్, సీఎం కేర్స్ పథకాల కింద సంరక్షణ పొందుతున్న పిల్లలకు బహుమతులను అందజేశారు. బాలల రక్షణకు ఏర్పాటు చేసిన అత్యవసర రక్షణ వ్యవస్థల ఫోన్ నెంబర్లతో ముద్రించిన గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషనర్ సభ్యులు టి.ఆదిలక్ష్మి, కార్మిక శాఖ ఏసీ ఎం.బుల్లిరాణి, డీఆర్‌డీఏ ఏపీడీ ఎంఎం జిలాని, చైల్ ప్రోటెక్షన్ అధికారి సిహెచ్ వెంకట్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment