బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన అవసరం
శృంగేరీ పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలని శృంగేరీ పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక విరించి వాన ప్రస్థాశ్రమంలో పిల్లల అంధత్వ నివారణ కోసం మహాపాశుపత రుద్రహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాస్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. మనకున్న కొద్ది సమయంలో భగవంతుని చింతనలో గడపాలన్నారు. వ్యర్థమైన విషయాలను వదిలి పెట్టాలని సూచించారు. పూజ గదిలో భగవంతుని ఎదురుగా కూర్చున్నప్పుడు మనస్సు ఆ దైవంపైనే ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ భగవత్ చింతనకు కొంత సమయం కేటాయించుకోవాలని, ఆ సమయంలో ప్రళయం వచ్చినా భగవంతుడే పరిష్కారం చూపుతాడని నమ్మకం కలిగి ఉండాలన్నారు. ఆడిటర్ భాస్కరరామ్, విరించి వానప్రస్థాశ్రమం ట్రస్టీలు, ఆశ్రమ వాసులు హాజరయ్యారు.
వేద విద్య గురుకులం సందర్శన
రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని శ్రీదత్తాత్రేయ వేదవిద్యా గురుకులాన్ని శృంగేరీ పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి సందర్శించారు. గురుకులం నిర్వాహకుడు, స్వాధ్యాయ రత్న గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి, ఇతర అధ్యాపకులు విధుశేఖర భారతీ స్వామికి సాదరంగా స్వాగతం పలికారు. గురుకులం తరఫున స్వాగత పత్రాన్ని భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు, సీతారామచంద్ర ఘనపాఠీలు సమర్పించారు. పావన కార్తికమాస శివరాత్రి పర్వదినాన జగద్గురువులు గురుకులాన్ని సందర్శించడం తమ అనుష్టాన భాగ్యవిశేషమని సీతారామచంద్ర ఘనపాఠి అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు సంప్రదాయ పద్ధతిలో వేద విద్యను నేర్పుతున్న నిర్వాహకులకు విధుశేఖర భారతీస్వామి ఆశీస్సులు అందజేశారు. శృంగేరీ పీఠం తరఫున రూ.రెండు లక్షల విరాళాన్ని గురుకులానికి ఆయన ఇచ్చారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం శృంగేరీ శారదా శంకర మఠం ధర్మాధికారి వేలూరి వెంకటరామయ్య, పలువురు వేదపండితులు, వేద శాస్త్రాభిమానులు, వేద విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment