కలెక్టర్ ఆదేశం
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక ప్రక్రియ గురువారం స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఆర్వో, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఏఆర్వో, కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావుతో కలిసి కాకినాడ, పెద్దాపురం, ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానం, వెబ్‌కాస్టింగ్, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కి తరలించడం, రిసెప్షన్ సెంటర్లు సెక్టార్, రూట్ అధికారులు, పోలీస్ బందోబస్తు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు వంటి ఏర్పాట్లపై చర్చించారు. ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. కాకినాడ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాలన్నారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
బియ్యం అక్రమ రవాణా నివారించాలి
ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి పౌర సరఫరాలు, పోలీస్ అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బియ్యాన్ని ఎలా తనిఖీ చేయాలి, శాంపిల్ ఎలా తీయాలి, దానిని ఎలా పరీక్షించాలి, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పీడీఎస్ బియ్యంగా మార్చడంలో ఉన్న దశలను, రైస్ మిల్లుల నుంచి బియ్యం ఎన్ని రకాలుగా మార్కెట్‌లోకి వస్తున్నాయో పరిశీలించాలన్నారు. వర్క్‌షాపులో పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం దేవులా నాయక్, ఇన్‌చార్జి డీఎస్‌వో టి.లక్ష్మీప్రసన్నదేవి, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఇతర పోలీస్ అధికారులు, పౌరసరఫరాలశాఖ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment