ప్రత్యేక అవసరాలు గల పిల్లలు బడిలో భాగమే
కాకినాడ రూరల్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా బడిలో భాగమేనని వారిని బడుల్లో చేర్చుకుని సహిత విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని వలసపాకల మండల పరిషత్ మెయిన్ స్కూల్ వద్ద గల భవిత సెంటరులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త చామంతి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భవిత సెంటరును పరిశీలించి పలు సూచనలు చేశారు. డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులను, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి భవిత కేంద్రాల ద్వారా విద్యను అందిస్తుందన్నారు. భవిత సెంటరులో ప్రత్యేకమైన శిక్షణను అందిస్తుండడంతో పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలను నిర్వహించారు. డీఈఓ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఇన్నర్ వీల్స్ ఆఫ్ కాకినాడ క్లబ్ సభ్యులు లక్ష్మి, దుర్గ, నివేదిత, వరలక్ష్మి, మల్లేశ్వరి భవిత సెంటరుకు హెచ్‌పీ కలర్ ప్రింటర్‌ను బహూకరించారు. ఎంఈఓ 2 ఏసుదాసు, వాకలపూడి కాంప్లెక్స్ హెచ్‌ఎం మూర్తి, వలపపాకల స్కూల్ హెచ్‌ఎం నాగవేణి, భవిత సెంటర్ ఇనస్ట్రక్టర్లు నాగలక్ష్మి, వీరగణేష్, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment