బియ్యం ఎగుమతి మూలాల ధ్రువీకరణలో మా పాత్ర లేదు
కస్టమ్స్ కమిషనర్ నరసింహారెడ్డి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విదేశాలకు ఎగుమతి చేసే బియ్యం మూలాలను ధ్రువీకరించడంలో తమ శాఖ పాత్ర లేదని కస్టమ్స్ కమిషనర్ (విజయవాడ) సాధు నరసింహారెడ్డి తెలిపారు. కస్టమ్స్ నోటిఫైడ్ ఏరియాలోకి బియ్యం ప్రవేశించిన తర్వాత కస్టమ్స్ పాత్ర ప్రారంభమవుతుందన్నారు. కమిషనర్ నరసింహారెడ్డి మంగళవారం కాకినాడ కస్టమ్స్ హౌస్‌ను సందర్శించారు. అనంతరం అధికారులు, వ్యాపారులతో వివిధ సమస్యలపై చర్చించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన సీకార్గో మేనిఫెస్టో, ట్రాన్స్‌షిప్‌మెంట్ రెగ్యులేషన్స్ (ఎస్‌సీఎంటీఆర్)–టెక్నికల్, సీబీఎల్‌ఎంఎస్ పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను వాణిజ్య ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై వ్యాపారవేత్తలకు త్వరలో శిక్షణ ఏర్పాటు చేస్తామని కమిషనర్ చెప్పారు. పీడీఎస్ బియ్యం ఎగుమతి సమస్యపై కూడా కమిషనర్ చర్చించారు. రైస్ ఎక్స్‌పోర్టర్స్ సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు మాట్లాడుతూ.. తాము చట్టాన్ని గౌరవిస్తున్నామని, ఎగుమతి కోసం పీడీఎస్ బియ్యాన్ని మళ్లించే ఎటువంటి కార్యకలాపాలకు తమ సంఘం మద్దతు ఇవ్వదన్నారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. స్టీవ్‌డోర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ బియ్యం ఎగుమతిపై స్పష్టత వచ్చే వరకు తెల్ల బియ్యం ఎగుమతి నిర్వహణను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు.
పౌరసరఫరాల ఎన్‌ఓసీ తీసుకోవాలి
కాకినాడ కస్టమ్స్ అదనపు కమిషనర్ జి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ కాకినాడ కలెక్టర్ జూలై 31 ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పోర్టు ఏరియాలో ఆగస్టు 5 నుంచి పోలీసు, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారుల ద్వారా పనిచేసేలా సమీకృత చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. పోర్టులోకి వచ్చే వాహనాలను తనిఖీ చేయించుకుని ఎగుమతిదారులు పౌర సరఫరాల ఎన్‌ఓసీ తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. పీడీఎస్ బియ్యం మళ్లింపు సహా ఏదైనా ముప్పును అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కస్టమ్స్ విభాగం కట్టుబడి ఉందన్నారు. విశాఖపట్నంలో రాష్ట్రవ్యాప్తంగా కస్టమ్స్, వ్యాపారవేత్తలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్లు ఎన్.రవికుమార్, జీఎస్‌ఆర్ నాయుడు, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ బి.మహేష్‌బాబు, కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వీవీ రాఘవులు, కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment