సన్నాలు కొనేవారేరి? | - | Sakshi
Sakshi News home page

సన్నాలు కొనేవారేరి?

Published Wed, Dec 4 2024 12:05 AM | Last Updated on Wed, Dec 4 2024 12:05 AM

సన్నా

సన్నాలు కొనేవారేరి?

చుక్కలు చూపిస్తోన్న దళారులు

సాంబ మసూరి రైతుల గగ్గోలు

కొనుగోలు పట్టించుకోని ప్రభుత్వం

సీజన్‌లో 60 వేల ఎకరాల్లో సాగు

బస్తా రూ.1,500కు కొనుగోలు

నిల్వ చేసుకుంటే రూ.2,500 పై మాటే

సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీపీటీ సన్న రకాలు పండించిన రైతులు గిట్టుబాటు లేక లబోదిబోమంటున్నారు. ప్రకృతి కన్నెర్ర చేసిన విపత్కర సమయంలో రైతులను సకాలంలో ఆదుకోవాల్సిన సర్కారు చేతులెత్తేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 80శాతం ఆయకట్టు రైతులు స్వర్ణ మసూరి రకాన్ని సాగు చేశారు. మిగిలిన 20 శాతం ఆయకట్టులో బీపీటీ సాంబమసూరి సన్న రకాన్ని వేశారు. జిల్లాలో 2.14 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే ఇందులో 60వేల ఎకరాలు బీపీటీ సాంబ మసూరి రకాన్ని సాగు చేశారు. పెట్టుబడి కాస్త ఎక్కువైనా ధర ఆశాజనకంగా ఉంటుందని గంపెడాశతో బీపీటీ సాంబ మసూరి రకాన్ని వేసిన రైతులకు దళారులు, కమీషన్‌ ఏజెంట్లు చుక్కలు చూపిస్తున్నారు. అనుకోకుండా వచ్చిపడ్డ ఫెంగల్‌ తుపానుతో జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో రైతులు అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తుపానుతో గడచిన మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయింది. ధర ఆశాజనకంగా ఉంటుందని సన్నాలు సాగు చేసిన రైతులైతే అసలు ఈ పంట ఎందుకు వేశాం దేవుడా అంటూ కంటతడి పెడుతున్నారు. సహజంగా సన్న రకమైన బీపీటీకి ఈ సీజన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ధర కూడా ఆశాజనకంగా ఉంటుందని రైతులు గంపెడాశ పెట్టుకున్నారు. ఈ పంట సాగుచేసిన రైతులు వరి కోత కోసి స్వయంగా నూర్పిళ్లు చేసుకుని నెల, నెలన్నర నిల్వ చేసుకుని మంచి ధర వచ్చాక అమ్ముకుంటుంటారు.

పెట్టుబడి ఎక్కువైనా..

బీపీటీ సాగు కోసం ఎకరాకు రూ.30వేల నుంచి రూ.35వేల పెట్టుబడి పెట్టారు. ఇతర రకాలతో పోలిస్తే ఈ రకానికి పెట్టుబడి పదివేలు ఎక్కువే అవుతుంది. స్వర్ణ రకంతో పోల్చుకుంటే బీపీటీ సాంబమసూరి తక్కువ దిగుబడి వస్తుంది. అయినా నిల్వచేసుకుని అమ్ముకుంటే మంచి ధర వస్తుందని రైతులు ఈ రకం సాగు చేశారు. గతేడాది ఒక ఎకరం పొలంలో స్వర్ణ 40 బస్తాలు దిగుబడి రాగా, బీపీటీ సాంబ 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. అయినా ధరలో మంచి జరుగుతుందని అనుకున్నారు. ఈసారి అవే అంచనాలతో బీపీటీ సాంబ మసూరి సాగుచేసిన రైతులు వరి కోతలకు సిద్ధమయ్యారు. గొల్లప్రోలు, పిఠాపురం, కరప, పెద్దాపురం, సామర్లకోట తదితర మండలాల్లో రైతులు ఈ రకం పంట కోతలు జరుపుతోన్న సమయంలో తుపాను దెబ్బతీసింది. మెషీన్‌లతో పంట ఒబ్బిడి చేసినా అప్పటికే ధాన్యం తడిసిపోయింది. దీనిని సాకుగా తీసుకుని దళారులు, కమీషన్‌ ఏజెంట్లు అమాంతం ధరలను తగ్గించేశారు. వాస్తవానికి ఈ రకాల ధాన్యానికి ధర రూ.2,300 నుంచి రూ.2,500 పలుకుతుందని రైతులు లెక్కలు వేసుకున్నారు. ఇంత లేకున్నా కనీసం రూ.2,200లు తక్కువ కాకుండా వస్తుందనే ఆశతో ధైర్యం చేసి సాగు చేసిన రైతులు ఇప్పుడున్న ధర చూసి గుండెలు బాదుకుంటున్నారు.

వర్షాలు దెబ్బ తీశాయి

ధర ఎక్కువగా ఉంటుందనే ఆశపడి బీపీటీ సాంబ మసూరి సాగు చేశాను. గత సీజన్‌లో ఇలానే వేసిన సాంబ మసూరికి మంచి ధర రావడంతో ఈ సారి కూడా అదే సాగు చేశాను. కానీ ఈసారి వర్షాలు దెబ్బ తీశాయి. పెట్టుబడి స్వర్ణ రకం కంటే కాస్త ఎక్కువైనా.. ధర వస్తుందని ఎదురు చూశాను. తీరా వర్షాలకు తడిసి పోవడంతో రూ.1,500కి మించి కొనే నాథుడే లేకుండా పోయాడు.

సుందరరెడ్డి రాజు, కౌలు రైతు, పులిమేరు,

పెద్దాపురం మండలం

అన్నదాతల ఆవేదన

కుప్పలు వేసి ఆరబెట్టి అమ్ముకుంటే అనుకున్న ధర రూ.2,500 వస్తుంది. వర్షానికి తడిసిపోవడంతో ఆరబెట్టి అమ్మే సరికి తూకం తగ్గిపోయి నష్టపోతామని రైతులు పచ్చి ధాన్యం కళ్లాల్లోనే అమ్మేస్తున్నారు. 75 కేజీల బస్తా రూ.1,400, రూ.1,500కి మించి కొనుగోలు చేయడం లేదని రైతులు మొత్తుకుంటున్నా సర్కారు చెవికెక్కడం లేదు. ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని బీపీటీ సాంబమసూరి సాగు చేసిన రైతులు దిగులు చెందుతున్నా రు. ఈ తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై కనీసం దృష్టి పెట్టడం లేదంటున్నారు. రైతుల వద్ద నుంచి ఈ రకం ధాన్యాన్ని దళారుల ద్వారా కొనుగోలు చేసిన మిల్లర్లు బాయిల్డ్‌ చేసి మంచి ధరకు అమ్ముకుంటున్నారు. వాతావరణ పరిస్థితులకు తలొగ్గి తక్కువ ధరకే అమ్మేసుకోవాల్సి వస్తోందని రైతులు మదనపడుతున్నారు. నెల రోజులు ఆగితే సన్న రకాలకు మంచి డిమాండ్‌ ఉంటుందని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు రూ.1,400కే అమ్ముకుంటున్నారు. అంటే ప్రతి బస్తాపైనా రూ.800 బీపీటీ సాంబ మసూరి రైతులు కోల్పోతున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం బీపీటీ స్టీమ్‌ బియ్యం 25 కేజీల బస్తా రూ.1,500కు అమ్ముడుపోతోంది. ఈ లెక్కన 75 కేజీలు రూ.4,500 పలుకుతుంది. బియ్యం ఇలా మంచి ధర పలుకుతుంటే తమ రెక్కల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోందని రైతులు మదనపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సన్నాలు కొనేవారేరి?1
1/1

సన్నాలు కొనేవారేరి?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement