కాకినాడ సిటీ: కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు పారిశ్రామిక, ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.మల్లిబాబు కోరారు. కాకినాడ పోర్టు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ వ్యాపార, పారిశ్రామికవేత్తలు, ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్ట్ ప్రతినిధులతో మంగళవారం రాత్రి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకొని అనేక వ్యాపార కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయన్నారు. ఈ కార్యకలాపాలతో వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోందన్నారు.
కాకినాడ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపేందుకు స్థానికంగా నెలకొల్పిన వివిధ పరిశ్రమలు, రవాణా రంగంలో ఉన్న వివిధ రకాల వాహనదారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పోలీస్, పరిశ్రమలు, రవాణా శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఆర్.సుస్మిత, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, రవాణాశాఖ డీటీసీ మురళీకృష్ణ, పరిశ్రమశాఖ జీఎం సీహెచ్ గణపతి పాల్గొని పోర్టు పరిధిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వివిధ వ్యాపార, పారిశ్రామికవేత్తలు, ట్రాన్స్‌పోర్టు ప్రతినిధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాకినాడ సీ పోర్టు సీఈవో మురళీధర్, జెమిని ఎడిబుల్ ఆయిల్, ఇతర పరిశ్రమ సంస్థల ప్రతినిధులు, ట్రాన్స్‌పోర్టు, లారీ ఓనర్స్, టాంకర్స్, మినీ గూడ్స్ వ్యాన్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment