చలి పులి పంజా | - | Sakshi
Sakshi News home page

చలి పులి పంజా

Published Mon, Dec 2 2024 12:11 AM | Last Updated on Mon, Dec 2 2024 12:11 AM

చలి ప

చలి పులి పంజా

గత వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు

తేదీ కనిష్ట గతేడాది

ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత

25 16 21

26 18 22

27 17 24

28 17 22

29 16 21

30 16 21

1 16 23

తీవ్రమవుతున్న శీతల గాలులు

పొంచి ఉన్న వ్యాధుల ముప్పు

వారం రోజులుగా 18 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

కాకినాడ సిటీ: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 7 గంటల వరకు పొగ మంచు వదలడం లేదు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచే శీతల గాలులు వీస్తున్నాయి. ఆరు గంటల నుంచి చలి ప్రభావం ఉంటోంది. వారం రోజుల నుంచి 20 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు రాత్రి, తెల్లవారు జామున బయటకు రాలేకపోతున్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు, శీతల గాలుల వల్ల వ్యాధులు ప్రబలుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పొలం పనులకు వెళ్లే రైతు కూలీలు, వేటకు వెళ్లే మత్స్యకారులు, ఇతర పనులకు వెళ్లే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదయం పూట వ్యాయామానికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో నేలలో తేమ అధికంగా ఉంది. జలవనరులు పుష్కలంగా ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రభావం సాయంత్రం నుంచే కనిపిస్తోంది. ముఖ్యంగా వరి పొలాలు, నీటి ఆధారిత పంటలు సాగు చేస్తున్న పొలాల పై నుంచి వచ్చే తేమ గాలులకు మరింతగా చలి ఉంటోంది. గతేడాది చలి తీవ్రత అంతగా కనిపించలేదు. 21 నుంచి 24 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది నవంబర్‌ 10వ తేదీ నుంచే చలి గాలులు మొదలయ్యాయి. గడచిన వారం రోజుల నుంచి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. 16 నుంచి 19 డిగ్రీల నడుమ నమోదయ్యాయి. ఇక పొగ మంచు తీవ్రత అధికంగా ఉంది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచే గ్రామాలను మంచు కమ్మేస్తోంది. నడిరాత్రి సమయానికి తీవ్రంగా మారుతోంది. ఇక తెల్లవారే సమయంలో అత్యధికంగా ఉంటోంది. ఉదయం ఏడున్నర గంటలు దాటినా వదలడం లేదు.

ఆస్తమా ఉందా.. జాగ్రత్త

ఆస్తమా ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు వంటి ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోరాదు. కూల్‌ డ్రింక్స్‌, ఉప్పు అధికంగా ఉన్న పదార్థాలు, ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోరాదు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి.

ఫ్రిజ్‌లో ఆహారం తినొద్దు

చలికాలంలో మనం తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు వహించాలి. ఫ్రిజ్‌లో ఉండే ఐటెమ్స్‌ అసలు తినరాదు. కేవలం వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. చలికాాలంలో మద్యంతో పాటు టీ, కాఫీలను అధికంగా తాగుతారు కొందరు. ఇలా అసలు చేయరాదు. మద్యానికి దూరంగా ఉండాలి. టీ, కాఫీ రోజుకు రెండు మూడు కప్పులు మాత్రమే తీసుకోవచ్చు. దీంతో శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. తగనంత నీటిని తీసుకుంటే ద్రవాలు అంది జీవక్రియలు సరిగ్గా ఉంటాయి. చలికాలంలో జ్వరం, దగ్గు, జలుబు వంటివి మూడు రోజులకు మించి వేధిస్తుంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.

గుండెకు చలి తిప్పలు

తరచూ వాతావరణంలో వచ్చే మార్పులు శరీరంపై రకరకాల ప్రభావాన్ని చూపిస్తాయి. చలికాలంలో హార్ట్‌ పేషెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో అడ్రినలిన్‌, నారిటలిన్‌ వంటి హార్మోన్ల లెవెల్స్‌లో మార్పులొస్తాయి. ఇవి రక్త ప్రసరణలో మార్పులు తెస్తాయి. చలికాలం రక్తనాళాలు సహజంగా ముడుచుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటప్పుడు కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు పెరిగే ప్రమాదముంది. కాబట్టి చలి కాలం గుండె సమస్యలున్నవాళ్లు వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తుండటం ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూసుకోవచ్చు.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లరాదు. ఇంటి లోపలి ప్రదేశాలు కూడా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు కచ్చితంగా మూసివేయాలి. పండ్లు, కాయగూరలు, నట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆస్తమా రాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆస్తమా, నిమోనియా వంటి శ్వాసకోశ సమస్యలుంటే జాగ్రత్తగా ఉండాలి. కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్స్‌, ఐస్‌ వాటర్‌కు దూరంగా ఉంటే మంచిది. ఏసీ గదుల్లో ఎక్కువ సమయం ఉండరాదు.

జాగ్రత్తలు ఇలా

● చిన్న పిల్లల్లో చెవిపోటు, గొంతు నొప్పి, జలుబు, వచ్చే అవకాశం ఉన్నందున సూర్యరశ్మి వచ్చాకే బయటకు పంపించాలి.

● ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఇన్‌హేలర్‌ వాడడానికి బదులు ఉదయం సాయంత్రం వేళల్లో వేడి నీటి ఆవిరి పట్టడం మంచింది.

● చర్మం పొడిబారిపోకుండా ఔషధ పూరితమైన లేపనాలు వాడాలి.

● రసాయనాలతో కూడిన సబ్బులకు బదులు మైల్డ్‌ సోప్స్‌ వాడటం మంచిది.

● గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం

● చలి గాలుల కారణంగా చర్మ సంబంధిత, ఆస్తమా, గుండె జబ్బులు, చెవి, ముక్కు, గొంతు నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది.

● రోజు మూడు నుంచి 9 గ్లాసులు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

● బీపీ, సుగర్‌ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవాలి.

● ఆస్తమా శ్వాసకు సంబంధించిన సమస్యలున్నవారు మంచులో నడిచే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

● అలర్జీలు ఉన్న వారు చలి సమయంలో బయటకు రాకపోవడమే ఉత్తమం.

● జామ, బొప్పాయి, అరటి, దానిమ్మ పండ్లు మంచివి.

● పిల్లలను చీకటి పడే వరకు బహిరంగ స్థలాల్లో ఆడించకపోవడమే మంచిది. కాచి చల్లార్చిన నీటిని అందివ్వాలి.

జాగ్రత్తలు పాటించాలి

చలికాలంలో పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు అధికం. ప్రధానంగా ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి. రోజులో ఉదయం సాయంత్రం 30 నిమిషాల పాటు సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. విటమిన్‌–డి, సి అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. చెవిలోకి చల్లగాలి వెళ్లకుండా చూసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి.

– డాక్టర్‌ ఐ ప్రభాకర్‌,

ఆర్‌బీఎస్‌కె జిల్లా ప్రాజెక్డు ఆఫీసర్‌, కాకినాడ

వ్యాయామం తప్పనిసరి

చలికాలంలో చలి దెబ్బకు వ్యాయామానికి స్వస్తి చెప్పి దుప్పట్లో దూరిపోతారు. మరి కొందరు చలిలో కూడా వ్యాయామం చేస్తారు. కానీ ఈ సీజన్‌లో జాగ్రత్తలతో కూడిన వ్యాయామం చేయడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చలి పులి పంజా1
1/1

చలి పులి పంజా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement