వనదుర్గమ్మకు ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరిపై వనదుర్గ అమ్మవారికి కార్తిక అమావాస్య సందర్భంగా ఆదివారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. హోమం అనంతరం 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవారికి వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి నైవేద్యం చెల్లించారు. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, అర్చకులు దత్తాత్రేయశర్మ, కోట వంశీ, పరిచారకుడు వేణు వ్రత పురోహితులు కూచుమంచి ప్రసాద్, దేవులపల్లి ప్రకాష్ హోమం నిర్వహించారు.
భక్తులతో నిండిపోయిన హోమ మండపం
అమావాస్య ఆదివారం అరుదుగా వచ్చే పర్వదినం కావడంతో సుమారు 60 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రత్యంగిర హోమంలో పాల్గొన్నారు. దీంతో హోమ మండపం భక్తులతో నిండిపోయింది. దీంతో కొంతమంది భక్తులు వెలుపల నిడబడాల్సి వచ్చింది.
ఒప్పందం అమలుకు కమిటీ
ఎస్‌ఎస్‌ఏ జేఏసీ డిమాండ్
కాకినాడ సిటీ: జనవరిలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీకి ప్రభుత్వంతో జరిగిన సమ్మె ఒప్పందం అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు, జేఏసీ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జీవోలు, సర్క్యులర్లు, హెచ్‌ఆర్ పాలసీ, మినిమం టైమ్ స్కేల్ అమలు కోరుతూ కాకినాడ టీచర్స్ హోమ్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం జరిగి 11 నెలలు గడిచాయని, అనేక అంశాలపై ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉందన్నారు. ఈలోపు నిత్యావసరాల ధరలు, కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగి కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందన్నారు. మరోవైపు టార్గెట్లు పెట్టి మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా రాత్రి వరకు పని చేయిస్తూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను బానిసలకంటే దారుణంగా ట్రీట్ చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులపై భౌతికదాడులు చేస్తున్నా, బాధితులనే బాధ్యులను చేస్తూ అన్యాయం చేస్తున్నారని వివరించారు. సమ్మె ఒప్పందం మేరకు అన్ని రకాల ఆదేశాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి నాగమణి, కోశాధికారి పి.రాజు, ఐఈఆర్‌టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాగార్జున, సీఆర్‌పి రాష్ట్ర నాయకుడు రామ్ జి, జిల్లా అధ్యక్షులు టి మీరా సాహెబ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment