రైతులు పంట నష్టాన్ని నివారించుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుతం జిల్లాలోని తుపాను హెచ్చరికల నేపథ్యంలో వరి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.విజయ్‌కుమార్ రైతులను కోరారు. రైతులకు ఆదివారం ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
● కోతకి సిద్ధంగా ఉన్న వరి పంట కోయకూడదు.
● వరిపంట కోసి పూర్తిగా ఆరని పనలకు తుపాను నేపథ్యంలో కుప్ప వేసేటప్పుడు ఎకరాకు 25 కేజీల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు.
● కోత కోసి పొలాల్లో ఉన్న పనలు వర్షానికి తడిస్తే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలి. ఒక వేళ పొలంలో నీరు నిలిచిఉంటే పనలను గట్లపైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవాలి. వర్షాలు తగ్గి ఎండలు రాగానే పనలు తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి.
● కళ్లాల మీద ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భధ్రపరుచుకోవాలి.
● నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలు కాకపోతే గింజ మొలకెత్తడమే కాకుండా రంగుమారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాల్ ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తకుండా, చెడిపోకుండా ఉంటుంది.
● రంగు మారి, తడిసిన ధాన్యం పచ్చి బియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు.
● పగులు పొట్ట , పూత దశలో ఉన్న వరి పైరు 1 నుంచి 2 రెండు రోజులు కన్నా ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తిగా బయటకు రాకపోవడం, పుష్పాల్లో నీరు చేరడం వల్ల ఫలదీకరణ శక్తి కోల్పోయి తాలు, రంగు మారిన గింజలు ఏర్పడతాయి. గింజ రంగు మారకుండా ఉండడానికి లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా రెండు గ్రాముల కార్బెండిజం, మాంకోజెబ్ మందు పిచికారీ చేసుకోవాలి.
● పాలు పోసుకొనే దశలో ఉన్న పంట మునిగితే పిండి పదార్థాలు గింజల్లో చేరి గింజ బరువు తగ్గి రంగు మారడంతో దిగుబడి , నాణ్యత తగ్గుతాయి. గింజ రంగు మారకుండా లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం, ప్రొపికొనజోల్ మందు పిచికారీ చేసుకోవాలి.
● గింజ తోడుకునే , గట్టిపడే దశలో ఉన్న వరిపైరు బరువు వల్ల కొద్దిపాటి గాలి, వర్షాలకే ఒరిగిపోయి నేలనంటుందన్నారు. ఈ విధంగా పడిపోవడం వల్ల పిండి పదార్థం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గడం , తాలు గింజలు ఏర్పడడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టే చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment